జనసముద్రం న్యూస్, మే 16:
అల్కహాల్ ఎక్కువగా తాగేవారు.. ఊబకాయంతో బాధపడేవారు.. విపరీతంగా సిగరెట్లు తాగేవారు.. వీరి ఆయుష్షు త్వరగా తగ్గుతుందని త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారని చాలా మంది అనుకుంటారు. కానీ వీరందరినీ మించి తొందరగా వ్యాధులకు గురయ్యేవారున్నారు. వారే ఒంటరిగా ఉండేవారు. ఆ రోగమే ఒంటరితనం. అవును.. మీరు చదువుతున్నది నిజమే. మనస్తత్వ శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో కొన్ని కొత్త విషయాలు వెల్లడయ్యాయి.
ఒంటరితనం.. ఇది మెదడును అచేతన స్థితికి చేరుస్తుంది. అనేక మానసిక వ్యాధులకు మార్గం వేస్తుంది. ఒంటరిగా గడపడమంటే 15 సిగరెట్లు తాగడంతో సమానమని చెబుతున్నారు అమెరికాలో సర్జన్గా సేవలు అందిస్తున్న జనరల్ వివేక్ మూర్తి. 15 సిగరెట్లు కాలిస్తే మానవ శరీరం ఏ విధమైన చెడుకు లోనవుతుందో ఒంటరితనం కూడా అదే ప్రభావం చూపుతుందన్నారు. అకాలంగా మరణించడం-సామాజిక సంబంధాలు అనే అంశంపై అధ్యయనం జరిపిన పరిశోధకులు ఆసక్తికర అంశాలను వెల్లడించారు.
ఏడున్నర సంవత్సరాల పాటు జరిగిన ఈ అధ్యయనంలో 3 లక్షల మంది పాల్గొన్నారు. ఒంటరి వ్యక్తులు అకాల మరణాన్ని పొందడానికి 50 శాతం కంటే ఎక్కువ అవకాశం ఉందని ఈ అధ్యయనంలో తేలింది. ఒంటరితనం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు ఆల్కహాల్ వినియోగించేవారితో సమానమని ఈ అధ్యయనం నిరూపించింది. ఒంటరిగా ఉండేవారు డిప్రెషన్ మద్యపానం వంటి వాటికి అలవాటవుతారని నిద్రలేమి కూడా తోడవుతుందని చెప్పారు పరిశోధకులు.అందువల్ల ఒంటరితనాన్ని వీలైనంత త్వరగా విడిచిపెట్టాలి. ఎక్కువగా స్నేహితులతో గడపడం వల్ల ఒంటరితనాన్ని దూరం చేసుకోవచ్చు. పుస్తకాలు చదవడం వ్యాయామం యోగా వంటివి ఖచ్చితంగా చేయాలి. ఇవన్నీ ఇంట్లో కాకుండా జిమ్ సెంటర్ లైబ్రరీలలో అలవాటు చేసుకుంటే మేలు. అక్కడ చాలా మంది పరిచయస్తుల వల్ల ఒంటరితనాన్ని కొంత దూరం చేసుకోవచ్చు. వివిధ ప్రాంతాలను పర్యటించడం ద్వారా మరో మార్గం.