బ్యాంకుల నుంచి సామాన్యుడు ఓ 50 వేలు అప్పు చేయాలంటే తలకుమించిన పని. అంతేకాదు అనేక పత్రాలు గ్యారెంటీలు క్రెడిట్ స్కోరు సిబిల్ స్కోరు వగైరా.. వగైరా.. అన్నీ చూపించాలి. చివరకు చచ్చీ చెడీ తీసుకున్నాక.. ఒక్క నెల ఆలస్యమైతే కొంపలు మునిగిపోయినట్టు యాగీ!! మరి బడా బాబుల పరిస్థితి ఏంటి? అంటే ఇదిగో తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఘనత వహించిన బ్యాంకులు ఎంత మంది బడా బాబులకు అప్పులు ఇచ్చాయో.. ఎవరెవరు ఎగ్గొట్టారో కేవలం సంఖ్యా మాత్రంగా వెల్లడించింది. అది కూడా స్వచ్ఛందంగా కాదు. ఓ మీడియా సమాచార హక్కు కింద కోరితేనే సుమా!
ఆర్బీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం.. దేశంలోని బ్యాంకులు గత ఐదేళ్లలో ఏకంగా రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీ చేశాయి. రూ.1009510 కోట్ల (123.86 బిలియన్ డాలర్లు) మేర రద్దు చేయడం బ్యాంకుల ఎన్పీఏలు తగ్గుదలకు కారణమైంది. ఇక ఇచ్చిన రుణాల్లో 13 శాతం మాత్రమే బ్యాంకులు రికవరీ చేశాయి. అంటే రూ.132036 కోట్లు రికవరీ చేసినట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సమాచారం కోరగా ఈ మేరకు ఆర్బీఐ వివరాలు పంచుకుంది.గత పదేళ్లలో బ్యాంకుల నిరర్ధక ఆస్తుల తగ్గుదలకు రుణ మాఫీనే కారణమని ఆర్బీఐ విశ్లేషించింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి సమాచారాన్ని క్రోడీకరించినట్టు వివరించింది. ప్రభుత్వరంగ బ్యాంకులే అత్యధికంగా రుణమాఫీ చేశాయి. రూ.734738 కోట్లను ప్రభుత్వరంగ బ్యాంకులు రద్దు చేయగా.. ఏ బ్యాంకు ఎంతమేర మాఫీ చేసిందనే విషయాన్ని తెలపలేదు. ఈ తరహా సమాచారం తమవద్దలేదని వివరించింది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బ్యాంకులు పెద్ద రుణాలను మాఫీ చేసినప్పటికీ రుణగ్రహీతల వ్యక్తిగత వివరాలను మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. ఇది వారి క్రెడిట్(అప్పులు చేసేందుకు ఉన్న పరపతి) రేట్ను తగ్గిస్తుందని వెల్లడించడం గమనార్హం.(ఎగ్గొట్టినవారికి ఎంత మద్దతు?)
ఏయే బ్యాంకుకు ఎంత ఎగ్గొట్టారంటే..
ఎస్బీఐ రూ.204486 కోట్లు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.67214 కోట్లు
బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.66711 కోట్లు
షరా: ఇవి కొన్ని బ్యాంకులు మాత్రమే. ఈ జాబితాలో్ అతిపెద్దదైన యూనియన్ బ్యాంకు కూడా ఉంది. అయితే దీని వివరాలు ప్రత్యేకం అని ఆర్బీఐ వెల్లడించింది.