జనసముద్రం న్యూస్,జూన్ 27:
రచూ అంతర్జాతీయ వేదికల మీద కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ తొండివాదనను వినిపించే పాకిస్తాన్ కు తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ము వర్సిటీలో జరిగిన భద్రతా సదస్సుకు హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని.. ఆ విషయాన్ని పాక్ మర్చిపోకూడదన్న రాజ్ నాథ్.. పాక్ అక్రమిత కశ్మీర్ ను భారత్ లో కలపాలని అక్కడి ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు చెప్పారు.కశ్మీర్ నుంచి ప్రపంచ దృష్టిని భారత్ మళ్లిస్తుందని పాకిస్తాన్ అంటుందని.. ఆ విషయం నిజమని తానుకూడా అంగీకరిస్తానని పేర్కొన్నారు రాజ్ నాథ్. పాక్ కు తానో విషయాన్ని స్పష్టం చేయవాలని చెప్పిన రాజ్ నాథ్.. “కశ్మీర్ ను పట్టుకొని వేలాడటం ద్వారా ఎలాంటి ఫలితం ఉండదు. ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి.
భారత్ లో ఉన్న కశ్మీరీలు శాంతితోజీవనాన్ని సాగించటాన్ని పాక్ అక్రమిత కశ్మీర్ లో ఉన్న ప్రజలు గమనిస్తున్నారు. అక్కడ వారిపై అణిచివేత కొనసాగుతోంది. కబ్జా చేసినంత మాత్రాన పీవోకే పాకిస్తాన్ సొంతం కాబోదు. పాక్ అక్రమిత కశ్మీర్ భారత్ లో భాగం. ఈ విషయాన్ని ఒకసారి కాదు మూడు సార్లు భారత పార్లమెంట్ తీర్మానం చేసింది” అంటూ పాత విషయాల్ని గుర్తు చేశారు.పాక్ అక్రమిత కశ్మీర్ లో ఉన్న ప్రజలంతా తాము భారత్ లో కలవాలని కోరుకుంటున్నట్లు పలుమార్లు టీవీల్లో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. పీవోకేలోని ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాల్ని చూస్తుంటే.. భారత్ లో కలిపేయాలని అక్కడ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుందన్నారు. అక్కడి ప్రజలు తమను భారత్ లో విలీనం చేయాలని కోరటం చిన్న విషయం ఏమీ కాదన్న రాజ్ నాథ్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.