జనసముద్రం న్యూస్,మే 25:
స్మార్ట్ ఫోన్ అన్ లిమిటెడ్ డేటా వంటి సౌలభ్యాలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వ్యక్తిగత భద్రత సన్నగిల్లుతోందని చెప్పవచ్చు. పెరిగిన సాంకేతికత వల్ల ఎన్ని లాభాలున్నాయే అంతకుమించిన నష్టాలు ఉన్నాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. పైగా సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఎన్నో నేరాలను తరుచూ చూస్తూనే ఉన్నాం.
ఈ సైబర్ నేరగాళ్లకు చిక్కడంలో విద్యావంతులు అతీతులు కారు. ఎందుకంటే పెద్ద చదువులు చదివి కాస్తో కూస్తో సాంకేతికతపై అవగాహన ఉన్న వారు సైతం సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుతున్నారన్న విషయం మనకు తెలిసిందే. టెక్నాలజీపై పట్టు ఉన్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సైబర్ మోసగాళ్ల వలలో ఇటీవల చిక్కి ఏకంగా రూ.42 లక్షలు పోగొట్టుకున్నారు.
గురుగ్రామ్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సైబర్ మోసగాళ్లకు చిక్కి.. పెద్దమొత్తంలో డబ్బులు కోల్పోవడం కలకలం రేపుతోంది. అయతే ఆ కేటుగాళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు పార్ట్ టైమ్ జాబ్ ఆశ చూపారు. వాట్సాప్ ద్వారా ఆయనను సంప్రదించిన మోసగాళ్లు.. పార్ట్ టైమ్ జాబ్ ఇస్తామని నమ్మబలికారు. కొన్ని గ్రూపుల్లో చేరాలని అభ్యర్థించారు. అంతా తెలిసినా కూడా ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పలు గ్రూపుల్లో చేరారు. అంతే ఇక ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఖాతా నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.42లక్షలు స్వాహా చేశారు. అయితే ఇలాంటి కేసులు తరుచుగా జరుగుతున్న నేపథ్యంలో వాట్సాప్ వాటిని అరికట్టేందుకు భద్రతను కట్టుదిట్టం చేస్తోంది.ఖాతాదారుల వ్యక్తిగత భద్రతను పెంచడానికి వాట్సాప్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉందని చెప్పాలి. అంతేగాకుండా యూజర్స్ వాట్సాప్ ను టూ స్టెప్ అనగా రెండంచెల ధ్రువీకరణను సెట్ చేసుకోవాలని సూచిస్తోంది. ఇది మన ఖాతా సురక్షితంగా ఉంచుతుంది. రీసెట్ చేస్తున్నప్పుడు ధ్రువీకరణ చేస్తున్నప్పుడు ఆరు అంకెల పిన్ నంబర్ ను అడుగుతుంది. ఫలితంగా ఇతరులు మన ఖాతాలోకి ప్రవేశించడానికి వీలు ఉండదు. ఈ విధంగా టూ స్టెప్ ధ్రువీకరణ వల్ల మన ఖాతా కొంతవరకు సేఫ్.
తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. టెక్స్ట్ అభ్యర్థనలు నిజమే కాదో నిర్ధారించుకోవాలి. మన సమాచారాన్ని కోరిన అభ్యర్థనలు పంపినా ఆచితూచి అడుగేయాలి. అలాంటి మెసేజ్ లకు స్పందించకుండా ఉండడం మంచిది.లేదంటే ఆ వ్యక్తులు లేదా సంస్థలకు డైరెక్టుగా ఫోన్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఇకపోతే వారు పంపిన లింక్స్ ను అసలు తెరవకూడదు. వారికి ఎలాంటి వ్యక్తిగత సమాచారం అనగా చిరునామా ఫోన్ నంబరు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు పాస్ వర్డు ఓటీపీ బ్యాంకు ఖాతా వివరాలు వంటి వాటిని ఇతరులకు ఎవరికీ ఇవ్వకూడదు.
ఎలాంటి లావాదేవీల విషయాలను చర్చించవద్దు. డబ్బుల ప్రస్తావన వచ్చినపుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. సాధ్యమైనంత వరకు డబ్బులు ఇతరులకు పంపకపోవడమే మంచిది. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ కు స్పందిచవద్దు. అనుమానం వస్తే వెంటనే బ్లాక్ చేయాలి. రిపోర్టు చేస్తే బెటర్. అనుమానిత వాట్సాప్ గ్రూపుల్లో ఉండే వెంటనే ఎగ్జిట్ అవడం ఉత్తమం. అంతేగాకుండా దానిపై ఫిర్యాదు చేయాలి.
ఇకపోతే మన ఖాతా ప్రొఫైల్ ఫొటో ఆన్ లైన్ స్టేటస్ వంటి వాటిని ఎవరు చూడాలనే దానిపై ఆచితూచి వ్యవహరించాలి. ఇవి చూసే వారిని పరిమితంగా ఉంచుకుంటే మంచిది. సెట్టింగ్స్ లోని ప్రైవసీ విభాగంలో ఎవరు చూడాలి అనే అంశాన్ని మనమే సెట్ చేసుకోవచ్చు. మనకు నమ్మకమైన వ్యక్తులతోనే వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవాలి. సాధ్యమైనంత వరకూ ఇలా సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం చర్చించకపోవడమే సురక్షితమని టెక్ నిపుణులు అంటున్నారు.అంతేగాకుండా వాట్సాప్ అనుసంధానమైన పరికరాలను తరుచుగా చెక్ చేసుకోవాలి. అనుమానం వచ్చిన పరికరం నుంచి వెంటనే లాగ్ అవుట్ అవాలి. ఈ విధంగా పలు జాగ్రత్తలతో వ్యవహరించాలి. వివిధ బహుమతులు ఉద్యోగాలు డబ్బు లక్కీ డ్రాల వంటి పేరుతో బురిడీ కొడతారు. ఆదమరిస్తే సైబర్ కేటుగాళ్లు నిండా ముంచేస్తారు. అందుకే వాట్సాప్ తో తస్మాత్ జాగ్రత్త అని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.