జనసముద్రం న్యూస్,మే 25:
దేశంలో రాజకీయాలకు-సెంటిమెంటుకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. నాయకులు అయినా.. పార్టీలైనా సెంటిమెంటుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అలానే సెంటిమెంటు చూసుకునే పదవులు ఇస్తారు.. చేపడతారు కూడా.ఇప్పుడు కర్ణాటకలో వెలుగు చూసిన ఒక ఉదంతం.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. కర్నాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే.
దీంతో ఇటీవల ప్రభుత్వం కూడా ఏర్పాటైంది.అయితే రాజ్యాంగం ప్రకారం.. అసెంబ్లీకి స్పీకర్ను ఎన్నుకో వాల్సి ఉంది. ఇది రాజ్యాంగ విధి కూడా. అయితే.. ఇక్కడ చిత్రంగా 136 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. కొందరు మంత్రులుగా పీఠాలు పొందిన మిగిలిన వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ పదవిని స్వీకరించేందుకు ముందుకు రాలేదు. అధ్యక్షా అనిపించుకోండి.. అని కాంగ్రెస్ ఆఫర్ ఇస్తే.. మాకొద్దంటే.. మాకొద్దంటూ నాయ కులు తప్పించుకున్నారు.దీనికికారణం సెంటిమెంటు. స్పీకర్ పదవిని స్వీకరించేందుకు ఒక్క కర్నాటకలోనే కాదు.. ఏపీ తెలంగాణ తమిళనాడు కేరళ హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నూ అధికార పక్షం నాయకులు వెనుకంజ వేస్తున్నారు.
దీనికి కారణం స్పీకర్లు గా చేసిన వారు తదుపరి ఎన్నికల్లో విజయం దక్కించుకోలేక పోవడమే. ఏపీ లోనూ.. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా చేసిన యనమల రామకృష్ణుడు మళ్లీ గెలవలేదు. ప్రతిభా భారతి మళ్లీ గెలవలేదు. కేఆర్ సురేష్రెడ్డి నాదెండ్ల మనోహర్ కూడా పరాజయం పాలయ్యారు.
తెలంగాణలోనూ.. స్పీకర్గా చేసిన మధుసూదనాచారి మళ్లీ గెలవలేదు. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో స్పీకర్ ఓడిపోయారు. తమిళనాడులోనూ అలానే జరిగింది. కేరళలోనూ ఓడిపోయారు.దీంతో స్పీకర్ పదవి అంటే.. సెంటిమెంటుగా మారిపోయింది. ఇక తాజా విషయానికి వస్తే.. కన్నడ శాసన సభకు 9 సార్లు ఎన్నికైన మాజీ మంత్రి ఆర్వీ దేశ్పాండే ఏడుసార్లు ఎన్నికైన మాజీ మంత్రి టీబీ జయచంద్ర స్పీకర్ పదవిని స్వీకరించడానికి ససేమిరా అన్నారు.
దీంతో కాంగ్రెస్ పెద్దలు ఎట్టకేలకు దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన నేత మాజీ మంత్రి యూటీ ఖాదర్ను ఒప్పించారు. అది కూడా రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవిని ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు.ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే.. అప్పుడు ఎమ్మెల్సీని చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎట్టకేలకు ఖాదర్ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో బుధవారం జరిగే ఎన్నికల్లో ఏకగీవ్రం ఖాయమైంది.