
జనసముద్రం న్యూస్,మే 25:

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. సరిగ్గా లెక్కలోకి తీసుకుంటే పది నెలలు. ఒకవేళ.. ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లు ముందస్తుకు వెళ్లేందుకు సీఎం జగన్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంటే.. ఆ గడువు నాలుగైదు నెలలకు తగ్గిపోతుంది. షెడ్యూల్ ప్రకారం వెళతారా? ముందస్తుకు వెళతారా? అన్న చర్చకు బలం చేకూరేలా సీఎం జగన్ నోటి నుంచి ఇప్పటివరకు ఒక్క మాట కూడా రాలేదు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యన వరుస పెట్టి ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
అయితే.. ఆయన టూర్ కు వెళుతున్న ప్రతి చోట ఎదురయ్యే ఇబ్బందులు అన్ని ఇన్ని కావన్న మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నుంచి.. ఆయన జిల్లాలకు పర్యటనలకు వెళితే.. స్థానికంగా షాపులు మూయించేయటం.. ట్రాఫిక్ ఆంక్షల్ని పెద్ద ఎత్తున చేపట్టటం.. సమీపంలోని ఇళ్లల్లో నుంచి కూడా ఎవరూ రాకుండా భద్రతా చర్యల్ని చేపట్టే వ్యవహారం తరచూ వివాదాస్పదంగా మారుతోంది.ఇక.. ముఖ్యమంత్రిజగన్ పర్యటించే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెట్లను నరికేస్తున్నారని.. ఏర్పాట్ల పేరుతో ప్రజల్ని తెగ ఇబ్బంది పెడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జగన్ సభ సందర్భంగా జనాల తరలింపు విషయంలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ.. తాజాగాఒక ప్రచారం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. జగన్ పర్యటించే ప్రాంతాల్లో కనీసం 5 వేల ఓట్లు ఎఫెక్టు పడతాయంటున్నారు.
అదెలా అన్న మాటకు వారు వివరణ ఇస్తూ.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ వస్తున్నారంటే చాలు.. ఆంక్షల పర్వం మొదలవుతుందని.. ప్రతి విషయంలోనూ పరిమితులు విధిస్తున్నారని చెబుతున్నారు. అధికారుల ఓవరాక్షన్ తో జగన్ ను అభిమానించేవారు సైతం కొన్నిసార్లు సీరియస్ అవుతున్న పరిస్థితి ఉందంటున్నారు. దీనికి కారణం అధికారుల తీరు.. వైసీపీ నేతల్లోని కొందరి దురభిమానం కూడా కారణమని చెబుతున్నారు.జగన్ టూర్ కు జనం పాజిటివ్ గా రియాక్టు అయ్యేలా చేయకుండా.. తమకు ఇబ్బందులు ఎదురయ్యేందుకు కారణం ముఖ్యమంత్రే అన్న భావన కలిగించేలా కొందరి తీరు ఉందన్నమాట వినిపిస్తోంది. ఈ పరిమితుల కారణంగా.. జగన్ పర్యటించే ప్రాంతాల్లో కనీసం 5 వేల ఓట్లు పడకుండా పోవటం ఖాయమంటున్నారు.
బస్సుల్లో ప్రయాణించే వారకి ఆర్టీసీ బస్సులు లేకపోవటం.. దీంతో అవస్థలకు గురి కావటం.. ట్రాఫిక్ ను గంటల తరబడి వెయిట్ చేయించి.. ముఖ్యమంత్రి మాత్రం రివ్వున వెళ్లిపోతారు. ఈ నేపథ్యంలో వేలాది మంది ఎండలో.. రోడ్డు మీద వాహనాల్ని నిలిపేయటంతో.. తీవ్రమైన అవస్థలకు గురి అవుతున్నారు. దీనికి తోడు సీఎం సభకు చుట్టుపక్కల ప్రదేశాల్ని మూసేయటం.. రాకపోకల్ని బంద్ చేయటంతో ఆసుపత్రి లాంటి అత్యవసరాలకు వెళ్లే వారికి మహా ఇబ్బందికరంగా మారుతోంది.
ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎంజగన్ పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించిన విధానాల్లో మార్పులు చేయాల్సిసిన అవసరం ఉందంటున్నారు. వీలైనంత వరకు పరిమితుల్ని ఎత్తేయటం.. ఆంక్షల్ని విధించకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. సామాన్యులకు ఇబ్బందికరంగానూ.. ఒక షాకింగ్ అనుభూతి కలిగేలా చేయటం వల్ల సాధించేదేమిటి? అన్నది ప్రశ్నగా మారింది. అందుకే.. జగన్ టూర్ సందర్భంగా ఓవరాక్షన్ చేసే వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. తాను పాల్గొనే టూర్ల సందర్భంగా సామాన్యులు ఎదుర్కొనే సమస్యల మీద ముఖ్యమంత్రి జగన్ రియాక్టు కావాల్సిన అవసరం ఉందంటున్నారు. మరి.. సీఎం ఎప్పుడు రియాక్టు అవుతారో?