జనసముద్రం న్యూస్,జనవరి 13:
నువ్వు నాలుగు అన్నప్పుడు నేను ఒక్కటి అనలేనా? బలవంతుడు పది దెబ్బలు కొట్టినప్పుడు.. బలహీనుడు రెండు దెబ్బలు కొట్టకుండా ఉంటాడా? ఆ కొట్టే రెండు దెబ్బలు బలమైనవి.. గురి చూసి కొట్టినట్లయితే.. ఎంత బలవంతుడికి అయినా ఎదురయ్యే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.
రాజకీయ ప్రత్యర్థులను ఎలా టార్గెట్ చేయాలన్న దానిపై వైసీపీ నేతలు అనుసరించే విధానమే వేరుగా ఉంటుందన్న విషయం తెలియంది కాదు. ఇక.. వైసీపీ అధినేత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఎవరినైనా టార్గెట్ చేస్తే.. దేనికైనా సిద్ధమన్న మాటను ఆయన మాటల్ని వినే వారికి అర్థమవుతుంది. రాజకీయం గురించి.. రాజకీయాల గురించి మాట్లాడే వ్యక్తి.. రాజకీయాలకు దూరంగా ఉండే మహిళల గురించి.. వారి కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావించటానికి సైతం ఇష్టపడరు. అందుకు భిన్నంగా పవన్ కల్యాణ్ గురించి జగన్ తరచూ చేసే వ్యాఖ్యలు రెండే రెండు. అందులో ఒకటి మూడు పెళ్లిళ్లు. రెండోది ప్యాకేజీ స్టార్.
పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి అందరికి తెలిసిందే. చట్టబద్ధంగా ఇద్దరికి విడాకులు ఇచ్చిన తర్వాత మూడో పెళ్లి చేసుకోవటం. ఇక.. ప్యాకేజీ స్టార్ అన్న మాటకు ఇప్పటివరకు సరైన ఆధారం ఒక్కటంటే ఒక్కటి కూడా చూపించింది లేదు. దానికి సంబంధించిన ఆధారాన్ని ప్రదర్శించింది లేదు. ఇలా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన జగన్మోహన్ రెడ్డిపైన ఇప్పటివరకు ఎవరూ చేయని సంచలన ఆరోపణ చేశారు పవన్ కల్యాణ్. రణస్థలం వేదికగా చేసుకొని నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ను ఉద్దేశించి.. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రెండు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన చేసిన ఆరోపణల్లో నిజం ఎంత? అన్నది ప్రశ్నే అయినా.. ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే మాటల్ని అయితే అనగలిగారని చెప్పక తప్పదు. ఈ వాదనకు తగ్గట్లే.. రణస్థలం సభలో సీఎం జగన్ గురించి.. ఆయన వ్యక్తిగత అలవాటు గురించి పవన్ చేసిన వ్యాఖ్య అనంతరం..నిజంగానే ముఖ్యమంత్రికి అలాంటి అలవాటు ఉందా? అంటూ ఆరాలు తీయటం కనిపించింది. అంతేకాదు.. ఆయన స్కూల్లో చదివే రోజుల్లో ఏమేం చేసేవారో తనకన్ని తెలుసని.. కానీ తాను చెప్పటం లేదంటూ ట్విస్టు ఇచ్చారు.
ఇంతకూ సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా ఉన్న అలవాటు అంటూ పవన్ చేసిన ఆరోపణను ఆయన మాటల్లోనే చూస్తే.. ”పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తా.. సాయంత్రం సారాయి కింద పట్టుకుపోతా.. అలాంటి ప్రభుత్వం కావాలా?నవరత్రాలన్నాడు ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఆయన గారికి ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ఇష్టమంట” అంటూ సంచలన ఆరోపణ చేశారు. నిజానికి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ తరహా ఆరోపణ చేసిందెవరు లేదు. అందుకు భిన్నంగా తొలిసారి పవన్ నోటి నుంచి వచ్చిన ఈ మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ జగన్ కు ఇష్టమా? అన్న ఆరా ఇప్పుడు ఎక్కువైందన్న మాట వినిపిస్తోంది.
పవన్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో తన ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ఆరోపణపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని కల్పించారని చెప్పక తప్పదు. అంతేకాదు.. తాను తరచూ అనే మూడూ పెళ్లిళ్లు.. ప్యాకేజీ స్టార్.. దత్తపుత్రుడు అన్న మాటలకు బదులుగా తాను కూడా మాటలు పడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని జగన్ కు అర్థమయ్యేలా పవన్ చేశారని చెప్పాలి. అంతేకాదు.. ఆయన విద్యార్థిగా ఉన్న వేళలో ఆయనేం చేశారన్న దానిని పవన్ తన మాటల్లో ఏం చెప్పారన్నది చూస్తే.. ”నేను వ్యక్తిగతంగా విమర్శించాలంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్నప్పటి నుంచి మీ చరిత్ర నాకు తెలుసు. ఆయన సన్నిహతులు కూడా నాకు తెలుసు.. ఈ మహానుభావుడి వ్యవహారాలు మొత్తం వినేవాడిని. వ్యక్తిగత జీవితాలు మాట్లాడాలంటే నేను మీకంటే మహానుభావుడ్ని” అంటూ వ్యాఖ్యానించారు.తన మూడు పెళ్లిళ్ల మీద మరోసారి క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రికి కాస్తంత ఘాటుగానే సమాధానం చెప్పారని చెప్పాలి. ”మాట్లాడితే మూడు పెళ్లిళ్లంటావు. ఓ మూడు ముక్కల ముఖ్యమంత్రి నేను రెండుసార్లు విడకాలు ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నా. ఆ కాయ్ రాజా కాయ్ బ్యాచ్ ఉంటుంది. ఆటీన్ రాజాలు డైమండ్ రాణీలు ఉంటారు. ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రికి ఓ ఢంకా పలాసు సలహాదారు. ఇలాంటి సన్నాసి చేతకాని మూడుముక్కల ప్రభుత్వం” అంటూ ఫైర్ అయ్యారు.