ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్
జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా టౌన్ రిపోర్టర్ మే 16
ఏలూరు మే 16:
రబీ ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు,కౌలు రైతులకు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఏలూరు పవర్ పేట అన్నే భవనంలో గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రబీ ధాన్యం బకాయి సొమ్ములను చెల్లించకపోవడం వలన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంట సాగుకు చేసిన అప్పులు తీర్చలేక అష్ట కష్టాలు పడాల్సి వస్తోందన్నారు. ఋతుపవనాలు ముందే వస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధం కావాల్సిన సమయం రావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కాబట్టి ధాన్యం బకాయి సొమ్ముల నిధులను విడుదల చేసి రైతులు, కౌలు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసి ఆదుకోవాలని కోరారు. జిల్లాలో 80 వేల ఎకరాలు రబీలో రైతులు వరి పంట సాగు చేయగా 3.12 లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని అధికారులు అంచనా వేయగా 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని లక్ష్యాన్ని ఉద్దేశించడం వలన రైతుల పండించిన ధాన్యం ప్రతి గింజా కొంటామని చెప్పిన మాటకు ఆచరణకు పొంతనలేదని విమర్శించారు. నేటికీ జిల్లాలో చాలా చోట్ల కల్లాల్లో ధాన్యం ఉండిపోయిందని గోనె సంచులు అందుబాటులో లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులకు సరిపడా గోనె సంచులు అందించాలని కోరారు. ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల తర్వాత మరోలా వ్యవహరించడం తగదన్నారు. వాతావరణం మారి వర్షాలు పడుతున్న నేపథ్యంలో కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 21 రోజుల నిబంధనతో నిమిత్తం లేకుండా ధాన్యం సొమ్ములను వెంటనే చెల్లించాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చిన్ని పోతురాజు, బైరెడ్డి లక్ష్మణరావు పలువురు రైతులు,కౌలు రైతులు పాల్గొన్నారు.





