నసముద్రం న్యూస్ జూన్ 7:
ఒకపక్క ఒడిశా రైలు ప్రమాదం జరిగి ఆ రైలు ప్రమాదానికి గురైన బాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోతే మరొక పక్క కేటుగాళ్లు మాత్రం తమ పని తాము కానిస్తున్నారు. నిజానికి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చనిపోయిన వారికి అలాగే తీవ్రంగా గాయపడిన వారికి నష్టపరిహారం వంటివి ప్రకటిస్తూ ఉంటాయి.
ఈ నేపథ్యంలో వాటిని కొట్టేసేందుకు కేటుగాళ్లు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎవరు గుర్తించని మృతులను తమ కుటుంబ సభ్యులే అని నమ్మించి మృతదేహాలు తీసుకుంటున్నారు. ఆ తరువాత డెత్ సర్టిఫికెట్లు సంపాదించి వారి పేరు మీద నష్ట పరిహారాలు కూడా వెనకేసుకుంటున్నారు. అయితే ఇలా జరుగుతున్న వ్యవహారాన్ని పసిగట్టిన ఒడిశా ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది.
ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇదంతా గీతాంజలి అనే ఒక మహిళ ద్వారా వెళ్లడైంది. ఒరిశాలోని కటక్ కు చెందిన గీతాంజలి దత్త అనే మహిళ ఆదివారం బాలేశ్వర్ లోని మృతుల ఫోటోలు ఉంచిన ప్రదేశానికి వెళ్లి ఈ ప్రమాదం జరిగిన రోజు తన భర్త రైల్లో ప్రయాణిస్తున్నాడని అతని ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదని పోలీసులకు తెలిపింది.
వెంటనే అక్కడున్న ఫోటోలు చూడమని పోలీసులు సూచించడంతో కొన్ని ఫోటోలు చూసిన తర్వాత ఒక వ్యక్తి ఫోటో చూపిస్తూ అతను తన భర్తని చెప్పింది. అయితే ఆమె ప్రవర్తన మీద పోలీసులకు అనుమానం కలగడంతో తమదైన శైలిలో విచారించగా తన భర్త బతికే ఉన్నాడని ఎక్స్ గ్రేషియ కోసమే ఎలా వచ్చానని వెల్లడించింది.దీంతో అవాక్కైన పోలీసులు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మోసాలు కూడా జరిగే అవకాశం ఉందని వెంటనే అలర్ట్ జారీ చేసింది. కేటుగాళ్లు ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదని ఈ పరిణామం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి అన్ని విషయాలను జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం అని పోలీసులు సూచిస్తున్నారు.