
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,పినపాక, మార్చి 23.
పిల్లల ఎదుగుదలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని,గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు సరైన పోషకాహారం అందక చిన్నతనంలోనే వ్యాధుల బారిన పడుతున్నారని అలాంటి వారికి పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని అంగన్వాడీ టీచర్ సరళ తెలియజేశారు.గురువారం పినపాక మండలం, పాత రెడ్డిపాలెం పంచాయితీ పరిధిలోని చింతల బయ్యారం అంగన్వాడి స్కూల్ నందు తల్లిదండ్రులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నూతనంగా ప్రవేశపెట్టిన మిల్లెట్స్ కార్యక్రమం పై అవగాహన కల్పించారు.దాని ద్వారా పిల్లలకు పోషకాహారం ఏ విధంగా లభిస్తుందో వివరించి,అంగన్వాడీలో పోషకాహారం అందజేయడమే కాక విద్య, ఆట పాటలతో నేర్పిస్తున్నామన్నారు.వీటితో పాటు బాలికలు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాలను గుర్తించాలనే ఉద్దేశంతో ఈ నెలలో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పోషణ్ అభియాన్ కార్యక్రమాలలో పిల్లల బరువు,ఎత్తు పరిశీలిస్తున్నారు.అనంతరం మిల్లెట్స్ పై అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సరళ, పంచాయితీ సెక్రటరీ కొమరం సాంబశివరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





