
అనంతపురం జిల్లాలో పరిటాల రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతమంది శత్రువులు ఉన్నారో.. అంతకంటే ఆ కుటుంబాన్ని అభిమానించేవారున్నారు. పరిటాల రవి దారుణ హత్య తర్వాత ఆయన సతీమణి పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో సునీతకు బదులుగా ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి పరిటాల సునీత ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు.
అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన పరిణామాలతో పరిటాల కుటుంబం షాక్ కు గురయిందని అంటున్నారు. గుంటూరు వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కళ్లం హరికృష్ణారెడ్డి.. పరిటాల సునీత శ్రీరామ్ లపై పెట్టిన పోస్టు వివాదాస్పదమైంది. ఇది వైరల్ గా మారడంతో టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అతడికి ఘాటు కౌంటర్ ఇచ్చారు. గుంటూరులో ఉండి పోస్టులు పెట్టడం కాదని.. దమ్ముంటే అనంతపురం వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.
దీనికి తగ్గట్టే కళ్లం హరికృష్ణారెడ్డి కూడా అనంతపురం వచ్చి పరిటాల కుటుంబానికి వ్యతిరేకంగా మీడియాతో మాట్లాడాడు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున మోహరించారు. ఇంకోవైపు కళ్లం హరికృష్ణారెడ్డికి మద్దతుగా వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అనంతపురం నడిబొడ్డున పరిటాల కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ జై జగన్ నినాదాలతో హరికృష్ణారెడ్డి అతడి అనుచరులు హోరెత్తించారు.
వైసీపీలో తృతీయ శ్రేణిలో ఉన్న నాయకుడు అనంతపురం వచ్చి పరిటాల కుటుంబాన్ని దూషిస్తే దానికి తగ్గట్టు టీడీపీ నేతల నుంచి కౌంటర్లు లేకపోవడం పరిటాల కుటుంబాన్ని నిశ్చేష్టపరిచిందని అంటున్నారు. పరిటాల ఆధిపత్యాన్ని సహించలేని టీడీపీలోని కొందరు నేతలు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారని చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో సునీత ఆమె కుమారుడు శ్రీరామ్.. రాఫ్తాడు ధర్మవరం సీట్లు కావాలని అడుగుతున్నారు. దీన్ని కొంతమంది టీడీపీ నేతలు సహించలేకపోతున్నారని అంటున్నారు. అలాగే అనంతపురం జిల్లా టీడీపీ అంటే పరిటాల కుటుంబమే తామెవరం కాదన్నట్టు ఇన్నాళ్లు మరుగునపడిపోయామనే ఆవేదన కొంతమంది అనంత టీడీపీ నేతల్లో ఉందని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ఎక్కడో గుంటూరు నుంచి హరికృష్ణారెడ్డి అనే కార్యకర్త కంటే ఎక్కువ.. నాయకుడి కంటే చాలా తక్కువ నేత ఏకంగా అనంతపురం వచ్చి పరిటాల కుటుంబానికి సవాళ్లు విసిరినా టీడీపీ నేతలు పట్టించుకోలేదనే చర్చ జరుగుతోంది. ఏకంగా పరిటాల రవి స్వగ్రామమైన వెంకటాపురంతోపాటు రాఫ్తాడు రామగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో సైతం కళ్లం హరికృష్ణారెడ్డి పర్యటించినా స్థానిక టీడీపీ కార్యకర్తలు పట్టించుకోకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
హరికృష్ణారెడ్డి పరిటాల స్వగ్రామానికి వెళ్లి తీయించుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టినా టీడీపీ శ్రేణులు ముఖ్యంగా పరిటాల కుటుంబానికి చెందిన అభిమానులు స్పందించలేదు. ఎక్కడా ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు లేవు. చివరకు పరిటాల కుటుంబం కూడా అతడిని లైట్ తీసుకున్నారు.
అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబాన్ని కించపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లేకపోతే ఒక సాధారణ వైసీపీ నేత వెంకటాపురం అనంతపురం ఎలా వస్తాడు? ఇది పరిటాల కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని ఆ వర్గాల వాదన.





