ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీలను కలుపుకుని ముందుకు వెళ్లాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే ఏపీ బీజేపీ నేతలు తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని.. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవబోమని చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో సువర్ణావకాశం తలుపుతట్టింది. డిసెంబర్ 5న ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులతో కేంద్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయనుంది.
ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనుంది. ఇందులో పాల్గొనాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసి ఈ సమావేశానికి చంద్రబాబును ఆహ్వానించారు.
ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగానూ కేంద్రం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా చంద్రబాబు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు.
తాజాగా మరోమారు మోడీతో సమావేశమయ్యే అవకాశం రావడం చంద్రబాబుకు సువర్ణావకాశమేనని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో 2014లో పోటీ చేసినట్టే మూడు పార్టీలు జనసేన–టీడీపీ–బీజేపీ కలిసి పోటీ చేద్దామని కోరే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా డిసెంబర్ 5 నిర్వహించే సమావేశంలో భారత్లో నిర్వహించే జీ–20 భాగస్వామ్య దేశాల సదస్సుపై చర్చించనున్నారు. ఈ సమావేశంపై వివిధ రాజకీయ పార్టీల సూచనలు అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తెలుసుకోనుంది.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. జీ–20 దేశాల కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల ఇండోనేషియాలో జరిగిన సదస్సులో ఆ దేశ అధ్యక్షుడు నుంచి ప్రధాని మోడీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.