డల్లాస్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ, బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలు
అమెరికాలోని అనేక రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన ఎన్నారైలు
పొజీషన్ లో ఉన్నా.. ఆపొజిషన్ లో ఉన్నా మాకు తెలంగాణే ఫస్ట్
పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మళ్లీ మూడేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తాం.. తిరిగి కేసిఆర్ ముఖ్యమంత్రి అవుతారు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోవాలని ఎన్.ఆర్.ఐ లకు కేటీఆర్ పిలుపు
ఓట్లలో వెనుకబడ్డామేమో కానీ, తెలంగాణను ప్రేమించడంలో ఎన్నడూ వెనకబడలేదన్న కేటీఆర్
కేటీఆర్ చారిత్రక ప్రసంగానికి ఎన్నారైలు ఫిదా – హర్షధ్వానాలతో మారుమోగిన డల్లాస్ లోని సభా ప్రాంగణం

ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ జూన్ 04
14 ఏళ్ల అలుపెరగని పోరాటంతో సాధించిన తెలంగాణ రాష్ట్రం, ఉద్యమ రథసారథి కేసీఆర్ పాలనలో కేవలం పదేళ్ల వ్యవధిలోనే దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా ఎదిగిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ స్టార్టప్ స్టేట్ గా తెలంగాణ నిలిచిందని, ఇంత అమోఘమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం దేశంలోనే మరొకటి లేదన్నారు. తెలంగాణను అద్భుత అవకాశాల అక్షయపాత్ర గా, ఇండియాకే ఎకనామిక్ ఇంజన్ గా తీర్చిదిద్దిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్ కే దక్కిందన్నారు. అమెరికాలోని డల్లాస్ లో ఉన్న డాక్టర్ పెప్పర్ ఎరీనాలో అత్యంత ఘనంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జననీ జన్మభూమిఛ్చా స్వర్గాదపీ గరీయసీ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన కేటీఆర్, కర్మభూమి మీద కార్యదక్షులై వర్ధిల్లండి. కానీ జన్మభూమి రుణం కూడా తీర్చుకోవాలని ఎన్.ఆర్.ఐలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని విజ్ఞప్తి చేశారు. సంకల్పం, పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని తెలంగాణ రాష్ట్రం దేశానికి చాటిచెప్పిందని సగర్వంగా ప్రకటించారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో, 10 ఏళ్ల తెలంగాణ ఉజ్వల ప్రయాణంలో, అడుగడుగునా కేసిఆర్ వేసిన చారిత్రక ముద్రను అమెరికాలోని అనేక రాష్ట్రాల నుంచి వేలాది గా తరలివచ్చిన ఎన్.ఆర్.ఐ.ల హర్షధ్వానాల మధ్య కేటీఆర్ వివరించారు.
సమైక్యపాలకుల వివక్షతో దశాబ్దాలపాటు పడావుబడ్డ తెలంగాణ దీనస్థితిని, కేసీఆర్ గారి హయాంలో పదేళ్లలోనే సుజల, సుఫల, సస్యశ్యామల తెలంగాణగా ఎదిగిన తీరును కేటీఆర్ అద్భుతంగా ఆవిష్కరించారు. ట్రంప్ విధానాలతో ఇబ్బందులు పడుతున్న తెలుగు విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. అమెరికాలో లీగల్ సెల్ ఏర్పాటుచేసి తెలుగు విద్యార్థులను అన్నివిధాలా ఆదుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

కేటీఆర్ స్పీచ్ హైలైట్స్..
దశాబ్ది ఉత్సవాల నాడు తెలంగాణ గడ్డమీద ఎలాంటి ఉత్సాహం కనిపించిందో ఇవాళ డల్లాస్ లో కూడా అదే జోష్ కనిపిస్తుంది. ఇవాళ జరుగుతున్నది ఒక వేడుక మాత్రమే కాదు.. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సర్వస్వాన్ని ధారపోసిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకునే సందర్భం ఇది. అభివృద్ధి, ఆత్మ గౌరవం, తెలంగాణ అస్తిత్వ లక్ష్యాల సాధన కోసం 20 సంవత్సరాల క్రితం ఒక స్వప్నం చిగురించింది. తెలంగాణ ప్రజల పోరాటాలతోనే చరిత్ర సృష్టించబడింది. తెలుగువారికి రెండు రాష్ట్రాలు కాదు, మూడు రాష్ట్రాలు ఉన్నాయని టెక్సాస్ ను చూస్తే అనిపిస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలను జరుపుకుందాం అనుకున్నప్పుడు తెలంగాణ ఎన్నారైలు ఏకగ్రీవంగా సూచించిన నగరం డల్లాస్. ఇవాళ నాకు అమెరికాలో ఉన్నట్టు అనిపించడం లేదు. వేలాదిగా తరలివచ్చిన మిమ్మల్ని, మీ ఉత్సాహాన్ని చూస్తుంటే హైదరాబాదులో ఉన్నట్టే అనిపిస్తుంది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో 2015లో పెట్టుబడుల కోసం డల్లాస్ నగరానికి వచ్చాను. ఆనాడు ఆత్మవిశ్వాసంతో.. భవిష్యత్తు మీద నమ్మకంతో.. తెలంగాణ తరఫున కేసీఆర్ దూతలుగా మేము చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు నెరవేర్చడంతో పాటు చెప్పనివి కూడా ఎన్నో చేసి చూపించినందుకు గర్వంగా అనిపిస్తుంది.
జీవితంలో కలలు చాలా మంది అంటారు. కానీ కొందరే సాకారం చేసుకుంటారు. ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో, గుండె నిబ్బరంతో, తమ నమ్మకాన్ని పెట్టుబడిగా మలిచి స్వశక్తితో పైకి ఎదగడాన్ని చాలామంది అమెరికన్ డ్రీమ్ అంటారు. మీరు ఎలా అయితే ఒక స్వప్నాన్ని చూశారో 2001 సంవత్సరంలో ఒక బక్క పలచని మనిషి కూడా ఒక కల కన్నాడు. ఆ కల తన కోసం కాదు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కన్నాడు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్ముడి స్ఫూర్తితో… బోధించు సమీకరించు పోరాడు అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పూర్తిగా… ఐ హేవ్ ఏ డ్రీమ్ అని గర్జించిన మార్టీన్ లూథర్ కింగ్ స్పూర్తిగా చిమ్మచీకట్లలో ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమ బాట నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన ఒకే ఒక నాయకుడు కేసీఆర్…
శూన్యం నుంచి సునామి సృష్టించి, తెలంగాణ మిషన్ ఇంపాజిబుల్ అన్న పరిస్థితి ని మిషన్ పాజిబుల్ అన్న పరిస్థితికి తెచ్చి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ . ఆనాడు కెసిఆర్ పిలుపు మేరకు సకలజనులు ఏకమై అపూర్వ పోరాట సన్నివేశాలను ఆవిష్కరించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు.
అమెరికా గడ్డపై కూడా ఎన్నారైలు.. మాతృభూమి కోసం జై తెలంగాణ అని నినదించి తమ పోరాట స్ఫూర్తిని ఘనంగా చాటారు. కుట్రలను ఛేదించి, కుతంత్రాలను ఎదిరించి, అవమానాలను అధిగమించి అవరోధాలను కూకటి వేళ్ళతో పెకిలించి ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో ఏదైతే ఈ సుదీర్ఘ ప్రయాణం జరిగిందో ఇది దేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత కీలకమైన రాజకీయ అధ్యాయం.
మళ్లీ మూడేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తాం.. తిరిగి కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఓవైపు తెలంగాణ పార్టీకి రజతోత్సవం, మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి పుష్కర సంవత్సరం. గులాబీ జెండా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే రాష్ట్రం 12వ ఏట అడుగు పెట్టింది. 2001 ఏప్రిల్ 27 నాడు తెలంగాణ గర్వించే కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పురుడు పోసుకుంది. తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాకు పాతికేళ్లు నిండాయి. స్వీయ రాజకీయ అస్తిత్వానికి సిల్వర్ జూబ్లీ జరుగుతుంది. ఒక యోధుడు, ఒక వీరుడు వేసిన ఒక్క అడుగుతో జలదృశ్యంలో మొదలైన జర్నీ రెండున్నర దశాబ్దాల మైలురాయిని అందుకున్న అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. ఆత్మగౌరవ పోరాటాల వీర గాథల్లో శిథిలాల నుంచి శిఖరాన్ని చేరిన తెలంగాణ గెలుపు కథ తప్పకుండా సువర్ణాక్షరాలతో రాయబడుతుంది. ఇంత విలక్షణమైన, విశిష్టమైన ప్రయాణం, ప్రస్థానం ప్రపంచంలోని ఏ పార్టీకి ఉండదు. ఆటుపోట్లకు అదరలేదు. ఎదురుదెబ్బలకు బెదరలేదు. పని అయిపోయిందని ప్రచారం జరిగిన ప్రతిసారి బూడిదల నుంచి ఎగిరిన ఫీనిక్స్ పక్షి లాగా పైకి లేచి గమ్యాన్ని ముద్దాడింది కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్.
ఎన్నారైలను చూసి తెలంగాణ తల్లి గర్విస్తుంది. – కేటీఆర్
ఏ దేశమేగినా.. ఏ పీటమెక్కినా.. పుట్టిన గడ్డ పేరు వినగానే ఎవరికైనా పులకింత కలుగుతుంది. ఇక్కడ డల్లాస్ లో జై తెలంగాణ అని అందరూ నినదించినప్పుడు గుండెలనిండా మన ఆత్మగౌరవం ఆకాశమే హద్దుగా ఉప్పొంగింది. మాతృభూమి మీద మమకారంతో ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన ప్రతి ఒక్కరికి వందనం. అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
పదేళ్లపాటు ప్రభుత్వం లో ఉన్నప్పుడు దాన్ని బరువు లా భావించలేదు. బాధ్యతలా భావించాం. ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వాన్ని నడిపినందుకు అనితర సాధ్యమైన ఎన్నో విజయాలు సొంతం అయ్యాయి. విడిపోతే విఫల రాష్ట్రం అవుతుందని హేళన చేసిన చోటనే విజయకేతనం ఎగరవేశాం.. మిమ్మల్ని పరిపాలించే నాయకులు ఉన్నారా అని గెలిచేసిన నోళ్ళతోనే మాకు కూడా మీలాంటి నాయకులు ఉంటే బాగుంటుందనిపించాం.
స్వరాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలపడంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా కేసీఆర్ నాయకత్వంలో వదులుకోలేదు. మొన్నటి ఎన్నికల్లో ఓట్లల్లో వెనుకబడ్డాం కావచ్చు కానీ తెలంగాణను ప్రేమించడంలో ఎన్నటికీ వెనుకబడం. పొజిషన్ లో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా కచ్చితంగా మాకు తెలంగాణ ఫస్ట్, ఇండియానే ఫస్ట్..
అమెరికాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఎన్నారైలను చూసి తెలంగాణ తల్లి గర్విస్తుంది. తెలంగాణ మట్టి వాసనను మోసుకొచ్చి అగ్రరాజ్యంలో వెదజల్లుతున్న ప్రతిభావంతులు మీరు. ఖండాలను దాటి వచ్చి తెలంగాణ జెండాను రెపరెపలాడిస్తున్నది మీ నైపుణ్యం. మీ విజ్ఞానం మీ దక్షతకు వందనం.. తెలంగాణ రత్నాలు మీరు. భారతజాతి ముద్దుబిడ్డలు మీరు. తెలుగు తేజాలు మీరు. ఉద్యోగాల్లో…వ్యాపారాల్లో… పారిశ్రామిక రంగంలో మీ సత్తాను, సమర్థతను ప్రదర్శిస్తూ వేల మైళ్ల దూరంలో రాణిస్తూ భారత మాత ముద్దుబిడ్డలుగా తెలంగాణ తెలివికి ప్రతీకలుగా నిలుస్తున్న మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
నాటి ఉద్యమంలో అయినా.. పదేళ్ల ఉజ్వల ప్రయాణంలో అయినా తెలంగాణ ఎన్నారైలు పోషించిన పాత్ర అద్వితీయం.. తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ సువర్ణ అక్షరాలతో మీ పాత్ర లిఖించబడి ఉంటుంది .ఇక్కడ కనిపిస్తున్న ఆడబిడ్డలు పుట్టిన గడ్డకు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా ఏనాడు బతుకమ్మను మరిచిపోలేదు.. బతుకునిచ్చిన తెలంగాణ తల్లిని కూడా మర్చిపోలేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కంటికి రెప్పలా కాపాడుతూ పిల్లలకు భారతీయ సంస్కృతిని నేర్పిస్తున్న ఆడబిడ్డలందరికీ పేరుపేరునా హృదయపూర్వక వందనం.
కెసిఆర్ 14 ఏళ్ల పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని మీ మీ వృత్తుల్లో రాణించండి. మీ ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. ప్రతి అస్తిత్వం మనకు గర్వకారణమే. ఎన్నారై అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదు.. నెసెసరీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మాజీ ప్రధాని, తెలంగాణ ఠీవి పివీ నరసింహారావు భారత దేశ ముఖచిత్రాన్ని మార్చేశారు. ఆయన సేవలు చిరస్మరణీయం.
ఒకనాడు తెలంగాణ అనగానే కరువు, కన్నీళ్లు , ఆకలి చావులు, ఎన్కౌంటర్లు గుర్తొచ్చేవి. పడావుబడ్డ భూములు, పాడుబడ్డ బావులు, మొండి గోడలు, ఎండిపోయిన చెరువులు, బొంబాయి, దుబాయ్ , బొగ్గు బాయి లాంటి తెలంగాణ బతుకుల్ని ఒక దశాబ్ద కాలంలోనే కేసీఆర్ సంపూర్ణంగా మార్చారు. సుజల సుఫల సస్యశ్యామల తెలంగాణను ఆవిష్కరింపచేశారు. వలవల ఏడుస్తూ వలస వెళ్లిపోయిన పాలమూరుకు వలపోతల నుంచి విముక్తి కల్పించారు. బొక్కలు వంగి బతుకులు కుంగిన నల్లగొండ గుండెల పైనుంచి ఫ్లోరైడ్ బండను శాశ్వతంగా తొలగించారు. సాలెల మగ్గం సడుగులు విరిగి ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల నేతన్నలకు బీఆర్ఎస్ పాలనలో బతుకుపై భరోసా కల్పించారు. పిట్టల్లా రాలిపోయే విష జ్వరాల విషాదం నుంచి ఆదివాసీల బిడ్డలకు పదేళ్ల పాలనలో కొత్త జీవితాలను ప్రసాదించారు. కటిక చీకట్లతో, కరెంటు కోతలతో, కాలిన మోటర్లతో అల్లాడిపోయిన అంధకారం నుంచి వెలుగుల వైపు సాగిన తెలంగాణ ప్రయాణం దేశానికే స్ఫూర్తిదాయకం. నీళ్ళు లేక, బోర్ల మీద బోర్లు వేసి బొక్క బోర్లా పడి అప్పుల పాలై చేనుగట్ల కాడ శవాలుగా వేలాడిన అన్నదాతల ఆత్మహత్యల నివారణకు రైతుబంధు, రైతుభీమా వంటి ఎన్నో విప్లవాత్మక పథకాలతో దేశానికే దిక్సూచిగా నిలిచింది మన తెలంగాణ. మన బీఆర్ఎస్ ప్రభుత్వం.
“ బొంబాయి దుబాయ్ బొగ్గు బాయి బతుకులను మార్చి రివర్స్ మైగ్రేషన్ కు తెలంగాణను వేదికగా మార్చిన ఘనత కేసీఆర్ పాలనకే దక్కిందన్నారు. ఈనాడు కనిపించే అద్భుతాలన్నీ ఒకప్పటి కేసీఆర్ ఆలోచనలే. తెలంగాణ వస్తదా రాదా అని టీవీలలో, రాజకీయ సర్కిల్లో చర్చ జరుగుతుంటే .. తెలంగాణ వచ్చాక ఏం చేద్దాం అని ఆనాడే ఆలోచించిన దార్శనికుడు కేసీఆర్
“కేసిఆర్ కలలు, ఊహలు, ఆలోచనలు , కొంతమందికి అతిశయంగా అనిపించేవి. కానీ ప్రతి మనిషికి ఒక కల్పన ఉండాలి. భవిష్యత్తును ముందే ఊహించే ఆలోచనలు ఉండాలి. ఉద్యమ సందర్భంలోనే రేపటి తెలంగాణ రూపాన్ని కలర్ ఫుల్ గా కల్పన చేసిన విజనరీ కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మిగులు రాష్ట్రం అవుతుంది. ధనిక రాష్ట్రం అవుతుందని ఉద్యమ సందర్బంలోనే బలంగా వాదించిన నాయకుడు కేసీఆర్. ఇవాళ ఆయన వాక్కు నిజమైంది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సిరిసంపదలతో తెలంగాణ విరాజిల్లింది. దేశం కడుపునింపే స్థాయికి ఎదిగింది.
ఆర్థిక సౌష్టవంతో, సౌభాగ్యంతో అలరారింది. లక్షల కోట్ల సంపదను సృష్టించింది. కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రం, దేశాన్ని సాకే రాష్ట్రాలలో ఒకటిగా అవతరించిన వండర్ మన 10 ఏళ్ల పరిపాలనలోనే జరిగింది. 2.5% జనాభా ఉన్న తెలంగాణ వాటా దేశ జిడిపిలో ఐదు శాతంగా ఎదగడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణం. 2014లో తెలంగాణ జి ఎస్ డి పి నాలుగున్నర లక్షల కోట్లు అయితే మేం అధికారం నుంచి దిగిపోయే నాటికి 15 లక్షల కోట్లు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణ లాగా 238 శాతం పురోగతి సాధించలేదు.
2013 -14 లో తెలంగాణ తలసరి ఆదాయం కేవలం లక్ష 12 వేల రూపాయలు కానీ 2023లో మూడు లక్షల 56వేలు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2015-16 లో తెలంగాణలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ 13.18% అయితే 2023- 24 లో అది 3.76 శాతానికి తగ్గింది. కేవలం ఎనిమిదేళ్లలోనే 10 శాతం పేదరిక నిర్మూలన జరిగింది. తెలంగాణలో తప్ప ఇంకెక్కడ భారతదేశంలో ఇది జరగలేదు. శాస్త్రీయ అవగాహన, ఆర్థిక విజ్ఞానం లేని వాళ్ళు తెలివితక్కువ తనంతో అప్పుల మీద అబద్ధాలు ప్రచారం చేశారు. అప్పు చేసి తెలంగాణ పప్పుకూడు తినలేదు. అప్పుచేసి ఆర్థిక చక్రాన్ని తిప్పి ఆదాయాన్ని పోగుచేసి సంపద సృష్టించి రాష్ట్రంలోని పేదలకు పంచాము. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ తప్పలేదు. మితిమీరి అప్పులు చేయలేదు.. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పుల్లో తెలంగాణ ది 24 ర్యాంక్. బ్రహ్మాండమైన ఆర్థిక క్రమశిక్షణను మేం పాటించాం. చేయకూడని అప్పు చేయలేదు. చేయకూడని తప్పు చేయలేదు.
మూస పద్ధతుల్లో ముందుకెళ్లలేదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలతో వినూత్నమైన పద్ధతులతో విప్లవాన్ని సృష్టించాము. మాంద్యం ముసురుకున్న కాలంలోనూ, పెద్ద నోట్లు రద్దు అయిన సందర్భంలోనూ, కరోనా లాంటి మహమ్మారి విరుచుకుపడ్డ సమయంలోను తెలంగాణ వృద్ది తగ్గకుండా చూశాము.
కేసిఆర్ మాట ఇస్తే నెరవేర్చి తీరుతారన్న అచెంచెల విశ్వాసం తెలంగాణ ప్రజలది . కేసిఆర్ అంటేనే విశ్వాసానికి చిరునామా. ఆయన నినాదం ఇస్తే అది సంచలనం. ఆయన విధానాన్ని ప్రకటిస్తే అదొక విప్లవం. ఉద్యమదారి వదిలేస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పినా.. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ప్రకటించినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీ పోతున్నా తిరిగి తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వస్తానని చెప్పినా అది కేసీఆర్ ఆత్మవిశ్వాసానికి, ప్రజల మీద ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం.
నాలుగేళ్లలో ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇస్తా.. ఇవ్వకపోతే ఓట్ల అడగనని ప్రకటించిన నాయకుడు భారతదేశంలో కేసీఆర్ ఒక్కడే. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కరెంటు కోతలతో ఆగమాగం ఉండేది. కానీ 6 నెలల కాలంలోనే విద్యుత్ సమస్యను తీర్చి 7700 మెగావాట్ల కెపాసిటీ ఉన్న తెలంగాణను ఇవాళ 20 వేల మెగా వేట్ల కెపాసిటీకి తీసుకొచ్చింది కేసీఆర్ నాయకత్వం. తెలంగాణ వచ్చిన నాడు తలసరి విద్యుత్ వినియోగం కేవలం 1196 యూనిట్లు. కానీ 9 ఏళ్ళు తిరిగేసరికి 2398 యూనిట్లకు పెరిగింది. విప్లవాత్మకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులతో కేసీఆర్ ఆ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చారు. తుమ్మలు మొలిచిన కాకతీయుల కాలువల్లో ఆగకుండా నీళ్లు పారడానికి కారణం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం.
శివాలయం గా మారిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాళేశ్వరంతోనే పునరుజ్జీవనం పొందింది. త్రీ గోర్జెస్ డ్యాం కట్టడానికి చైనా వాళ్లకి 16 సంవత్సరాలు పట్టింది. కానీ ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణలో నాలుగేళ్లలో నిర్మించిన ఘనత కేసిఆర్ ది . కాళేశ్వరం కూలేశ్వరం అయిందని కొంతమంది మూర్ఖులు తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే జల అక్షయపాత్ర కాళేశ్వరం.. గోదావరి జలాలను 80 మీటర్ల సముద్రమట్టం నుంచి 618 మీటర్ల పైకి తీసుకపోయే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అంటే ఒక్క బరాజ్ కాదు కాళేశ్వరం అంటే మూడు బరాజ్ లు, 19 రిజర్వాయర్లు, 21 పంపు హౌస్ లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 141 టిఎంసిల స్టోరేజ్ కెపాసిటీ సమాహారం కాళేశ్వరం..
371 పిల్లర్లు ఉండే మూడు బరాజుల్లో రెండు పిల్లర్లకు నష్టం జరిగితే మొత్తం ప్రాజెక్టు కూలిపోయింది, వృధా అయిందని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విషప్రచారం ఆపండి, ఈ జల అక్షయపాత్రను సద్వినియోగం చేసుకోండి అని తెలంగాణ రైతుల తరపున అడుగుతున్నాం.. ఒకనాడు త్రీహెచ్పి మోటార్ నడపడానికి కూడా తెలంగాణ రైతులు అవస్థ పడ్డారు. అట్లాంటి తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 140 మెగావాట్ల బాహుబలి పంపులు గర్జించి కృష్ణ గోదావరి నీళ్లను ఎత్తిపోసి మన బీడు భూములకు మళ్లిస్తున్నాయి. దక్షిణ తెలంగాణకు వరప్రదాయని అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% మేం పూర్తిచేశాము. కేవలం 10% మిగిలింది. కానీ దాన్ని పూర్తి చేస్తే కేసిఆర్ కి మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చేస్తలేదు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరధి అంటే, నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అని కేసీఆర్ అన్నారు.
2014 – 15 నాటికి తెలంగాణలో 62 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్నా గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియాను 2023 నాటికి కోటి 60 లక్షల ఎకరాలకు తీసుకుపోయి కోటి ఎకరాల కొత్త ఆయకట్టును తెచ్చింది కేసీఆర్ నాయకత్వం. ఏ రాష్ట్రం కూడా ఈ ఘనతను సాధించలేదు. 2015లో రెండు పంటలకు కలిపి సాగు విస్తీర్ణం కోటి 31 లక్షల ఎకరాలు అయితే 2023 నాటికి రెండు పంటలకు కలిపి రెండు కోట్ల 29 లక్షల ఎకరాలకు నీళ్లు అందించి పంజాబ్ హర్యానాను తలదన్ని వరిధాన్యం ఉత్పత్తిలో భారత దేశంలో నెంబర్ వన్ గా నిలిచింది మన తెలంగాణ.
11 దఫాలుగా 73 వేల కోట్ల రూపాయలను డైరెక్ట్ గా రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు కే సీఆర్ . 2014లో భూముల విలువ 2023 నాటికి పది రెట్లు పెరిగింది. ఒకనాడు తెలంగాణ బిడ్డలు బతుకుతెరువు కోసం వలసలు పోయేది కానీ ఇప్పుడు బీహార్, జార్ఖండ్, ఒడిశా నుంచి కూలీలు వచ్చి మన పొలాల్లో పనిచేస్తున్నారు. పల్లెలే కాదు పట్నాలు కూడా మారాయి. పల్లెల్లో హార్వెస్టర్లు సందడి చేస్తే సిటీలో ఇన్వెస్టర్లు సందడి చేశారు. గ్రామాల్లో మడి పచ్చగా కళకలాడుతుంటే పట్టణాల్లో పెట్టుబడి తళతళలాడింది. తెలంగాణ పల్లెల్లో ప్రగతి మల్లెలు విరబూస్తుంటే పట్టణాలు అభివృద్ధి కేంద్రాలుగా విలసిల్లాయి. మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రతీ సంవత్సరం 30శాతం కంటే ఎక్కువ కేంద్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకుంది. రెడ్ టేప్ తీసేసి రెడ్ కార్పెట్ తో పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాం. ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా టీఎస్ ఐ పాస్ పాలసీని రూపొందించాం. టీఎస్ ఐపాస్ తో 27 వేల పైచిలుకు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా అగ్రభాగాన తెలంగాణను నిలిపాం.
గూగుల్, అమెజాన్, ఉబర్, సేల్స్ ఫోర్స్, ఆపిల్ కంపెనీలు తమ రెండవ అతిపెద్ద క్యాంపస్ లను హైదరాబాదులో ఏర్పాటుచేసేలా చేశాం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హైదరాబాద్ అభివృద్ధి చూసి ఆశ్చర్యపోయారు. హైదరాబాదులో ఉన్నానా ? న్యూయార్క్ లో ఉన్నానా? అనుకునేంత మార్పును పదేళ్లలో తీసుకొచ్చాం. 2014లో 57 వేల కోట్ల ఐటీ ఎగుమతులను 2023 నాటికి రెండు లక్షల 41 వేల కోట్లకు చేర్చాము. 2014లో ఐటీ ఉద్యోగుల సంఖ్య హైదరాబాదులో మూడు లక్షల ఇరవై మూడు వేలు ఉంటే మేం దిగిపోయేనాటికి 9లక్షల 46 వేల కు తీసుకుపోయాం. ఒక ఐటీ లోనే కాదు లైఫ్ సైన్సెస్ లో కూడా హైదరాబాద్ ను అగ్ర భాగాన నిలబెట్టాం.
తెలంగాణకు మాత్రమే కాదు భారతదేశానికే హైదరాబాద్ గుండెకాయ లాంటిది. అల్లర్లు, అలజడలు లేకుండా ఒక ప్రశాంత వాతావరణం, అద్భుతమైన శాంతిభద్రతలు ఉండాలని 10 లక్షల సిసి కెమెరాలు పెట్టి హైదరాబాద్ ను లివబుల్ లవబుల్, మోస్ట్ లవబుల్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దాం. పదేళ్ల కాలంలో రెండు లక్షల 32వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు అవకాశం ఇచ్చాం. కేరళను వదిలి పెట్టాలనుకున్న కిటెక్స్ కంపెనీని పట్టుబట్టి తెలంగాణకు రప్పించాం. కేసిఆర్ గారు తీసుకున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం, విధానం వెనకాల ఒక సామాజిక సోయి ,ఫిలాసఫీ ఉంది.ప్రతి స్కీం వెనుకాల ఒక మానవీయ స్పర్శ ఉంది. సామాజిక సంస్కరణ ఉంది.
పేద ఆడపిల్లల పెళ్ళికి లక్షా పదహారు వేల కానుక ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారత దేశంలో కేసిఆర్ ది మాత్రమే . 12 లక్షల మంది ఆడబిడ్డలకు లగ్గాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచడానికి, మాతాశిశు మరణాల రేటును తగ్గించడానికి పెట్టిందే కెసిఆర్ కిట్. 2014లో ప్రతి 1000 కి 39 శిశు మరణాలు ఉండేవి. కాని కేసీఆర్ కిట్ తో ఆ సంఖ్య 21 కి తగ్గింది. ప్రతి లక్ష జననాలకు 81 గా ఉన్న ప్రసూతి మరణాల రేటును 43 కి తగ్గించాం. 2014లో ఆరోగ్య సూచీల్లో తెలంగాణ 12వ స్థానంలో ఉండేది. 2023 నాటికి దాన్ని మూడో స్థానానికి చేర్చాం.
ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనేవారు కానీ కేసీఆర్ గారు తీసుకున్న చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రులపై జనాలకు నమ్మకం పెరిగింది. కేసిఆర్ గారి నాయకత్వంలో 1022 గురుకులాలు ఏర్పాటు చేశాం. ఆరు లక్షల మంది అట్టడుగు వర్గాల పిల్లలకు అద్భుతమైన విద్యను అందించే మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టాం. ప్రపంచంతో పోటీపడే ఒక బృహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేశాం. అగ్రవర్ణాల్లో ఉండే వెనుకబడ్డ వర్గాలకు కూడా అవకాశాలు కల్పించాము. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ,జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ ఉన్న ఒకే ఒక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ ఒక్కటే.
కేంద్ర ఒక్క మెడికల్ కాలేజీ , ఒక్క నర్సింగ్ కాలేజీ ఇవ్వకున్నా ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజ్ పెట్టుకున్నాం..20 లక్షల రూపాయల స్కాలర్షిప్ తో ఎనిమిది వేల మంది పిల్లల్ని కేసీఆర్ ప్రభుత్వం విదేశాల్లో చదివించింది.
అమెరికా విద్యార్థులకు అండగా ఉంటాం..
అమెరికాలో మన విద్యార్థులకు వస్తున్న ఇబ్బందులను తొలగించడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. లీగల్ సెల్ ఏర్పాటు చేసి మన విద్యార్థులకు అండగా నిలబడతామని కేసీఆర్ దూతగా మీకు మాట ఇస్తున్నాను. విజ్ఞాన ఆధారిత సమాజాలే ఇవాళ ప్రపంచంలో అగ్రగాములుగా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మార్పు అనివార్యం.. ఆ మార్పుకు మనం అలవాటు పడాలి. దాన్ని ఆస్వాదించాలి. అప్పుడే మనం నిలబడగలుగుతాం. జయం మనదే.. జై తెలంగాణ.








