
దశాబ్దన్నర నిరీక్షణకు తెర..!
వెల్దుర్తి చెంచులకు అగ్ర తాంబూలం..!
ఎమ్మెల్యే జూలకంటి
పల్నాడు బ్యూరో జనసముద్రం న్యూస్ , మే 20.
బడుగు బలహీన అణగారిన వర్గాల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో స్థానిక చెంచు కాలనీలోని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే జూలకంటి పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దన్నర నిరీక్షణకు తెర పడిందని చెప్పారు. 2018 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్థానిక చెంచుల దీనస్థితిని గమనించి.., ఇల్లు లేని నిరుపేదలను లబ్ధిదారులుగా గుర్తించి, నివేశ స్థలాలను మంజూరు చేస్తూ.. పట్టాలను తయారు చేసిందని, ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ ప్రక్రియ ఆగిందని ఆయన వివరించారు. అయితే 2019 గద్దెనెక్కిన వైసీపీ ప్రభుత్వంలో రాక్షసత్వం రాజ్యమేలి చెంచుల సంక్షేమాన్ని మరిచారని దుయ్యబట్టారు. ఐదేళ్లుగా తహశీల్దార్ కార్యాలయంలో ఇళ్ల పట్టాలను పెట్టి.., అవి అందజేయకుండా నానా ఇబ్బందులకు గురి చేశారని ఆయన వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెవెన్యూ పరంగా ఉన్న చిక్కులను అధికారులతో మాట్లాడి, స్థలాన్ని డివిజన్ చేసి.., నిర్దిష్టమైన కొలతలతో ఒక్కొక్క లబ్ధిదారుడికు మూడు సెంట్లు చొప్పున నివేశ స్థలాల కేటాయించి అందజేయడం జరిగిందన్నారు. ఒకే రోజు ఒక్క సంతకంతో 80 మందికి ఇళ్ల పట్టాలను అందజేయడం తో లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేసి, ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి తహశీల్దార్ బాషా, ఆర్ఐ మస్తాన్ వలి, వీఆర్వో శ్రీనివాసరావు, విలేజ్ సర్వేయర్ అయ్యప్ప, టిడిపి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.