
రాష్ట్రంలో 10,954 గ్రామాల్లో జూన్ 2 నుండి ఆగస్టు 15 వరకు
రెవెన్యూ సదస్సులు
భూ భారతి చట్టం రూపకర్త రాష్ట్ర అగ్రికల్చర్ రైతు కమిషన్ డైరెక్టర్ సునీల్ వెల్లడి
కామేపల్లి జనసముద్రం :
రాష్ట్రంలో భూ భారతి చట్టం ద్వారా రైతుల సమస్యలను రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తారని భూభారతి చట్టం రూపకర్త రాష్ట్ర వ్యవసాయ కమిషన్ డైరెక్టర్ సునీల్ వెల్లడించారు. మండలంలోని కొత్త లింగాల ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో బుధవారం నిర్వహించిన భూభారతి అవగాహన మండల స్థాయి సదస్సు తహసిల్దార్ సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ రైతులు తమకు పాస్ పుస్తకాల్లో భూమి సంబంధించిన మ్యాప్ కావాలని తాసిల్దారులకు దరఖాస్తు ఇస్తే లైసెన్సు సర్వేయర్ ద్వారా భూమిని కొలిచి మ్యాప్ కూడా పాస్ పుస్తకం లో అచ్చు వేసి రైతులకు అందజేస్తారని వెల్లడించారు. గతంలో పహానిల్లో మార్పులు చేర్పులు చేశారని ఈ చట్టం ద్వారా సంవత్సర కాలం పాటు కంప్యూటర్లో ఉండే పహానిలు మారకుండా ఉండడానికి ప్రతి ఏడాది రికార్డులను భద్రపరచటం జరుగుతుందని తెలిపారు.రైతులు కోర్టులకు పోవాల్సిన పనిలేదని ఆర్డీవో, జిల్లా కలెక్టర్ స్థాయిలలో వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులకు న్యాయ సహాయం రెవిన్యూ అధికారులే అందిస్తారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు భూదార్ కార్డులు అందించడం జరుగుతుందని అన్నారు.
రాష్ట్రంలో 10954 రెవిన్యూ గ్రామాల్లో జూన్ 2 తేదీ నుండి ఆగస్టు 15 వరకు
రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉందని తెలిపారు . రైతులకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు అందజేయడంతో పాటు భూ సమస్యలను ఎప్పటికప్పుడు తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి,డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్, కామేపల్లి, కొండాయిగూడెం సొసైటీ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, హనుమంతరావు, ఎంపీడీవో రవీందర్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ తార దేవి, వెలుగు ఏపిఎం శ్యామ్, డిప్యూటీ తాసిల్దార్ రఫీ పలువురు అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.