భారతీయ సంస్క్రుతికి నిలయమైన శిశు మందిర్ లకు పైసలెందుకు ఇవ్వరు?
నిర్వీర్యమవుతున్న ప్రభుత్వ పాఠశాలలను ఎందుకు పట్టించుకోరు?
దేశ చరిత్రను వక్రీకరిస్తూ విదేశీ భావజాలాన్ని పెంచిపోషిస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు
శిశు మందిర్ లు లేకుంటే సమాజమే నిర్వీర్యమయ్యే ప్రమాదం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్…
జమ్మికుంటలోని శ్రీవిద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన హాస్టల్ బ్లాక్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి
జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి సెప్టెంబర్ 19:
కరీంనగర్ : ఉగ్రవాదానికి బీజం వేస్తున్న మదర్సాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుండటం శోచనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చీపురపుల్లతో సైతం ఏకే 47లు తయారు చేసేంతటి శిక్షణనిస్తూ ఉగ్రవాదాన్ని పోషిస్తూ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన మదర్సాలకు ప్రభుత్వాలు నిధులివ్వడం ఎంత వరకు సమంజసం? అదే సమయంలో భారతీయ సనాతన సాంప్రదాయాలను, సంస్కృతిని పెంపొందిస్తూ విద్యను అభ్యసిస్తున్న సరస్వతి శిశు మందిర్ విద్యాలయాలకు ప్రభుత్వం నిధులెందుకు ఇవ్వడం లేదు?’’అని ప్రశ్నించారు. బుధవారం రోజు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన హాస్టల్ బ్లాకును కేంద్ర మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సరస్వతి శిశుమందిర్ గొప్పతనంతోపాటు శిశు మందిర్ కు, కార్పొరేట్ స్కూళ్లకు మధ్య ఉన్న తేడాను వివరించారు. దీంతోపాటు కార్పొరేట్ యుగంలో, విదేశీ విచ్చలవిడి సంస్కృతి కొనసాగుతున్న ఈరోజుల్లో కూడా అన్నింటినీ అధిగమిస్తూ శిశు మందిర్ నిలబడి ఎదుగుతున్నందుకు అభినందించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కార్పొరేట్ శక్తులు ఈ దేశ చరిత్రను వక్రీకరిస్తూ విదేశీ భావజాలం, సంస్కృతిని పెంపొందిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణలో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 20 వేలకుపైగా స్కావెంజర్ పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోవడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు. మధ్యాహ్న భోజన బాధ్యత కూడా ప్రధానోపాధ్యాయులపైనే పెట్టారు. ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ శాఖకు విద్యా మంత్రి కూడా లేకపోవడం శోచనీయం.
భారతీయ సనాతన సాంప్రదాయాలను, సంస్కృతికి అనుగుణంగా విద్యను అభ్యసిస్తున్న ఏకైక పాఠశాల సరస్వతి శిశు మందిర్ మాత్రమే. దీంతోపాటు దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను, రాష్ట్రాల్లో ఎదురవుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు బోధిస్తూ సమకాలీన అంశాలపై అవగాహన కల్పిస్తున్న సంస్థ కూడా సరస్వతి శిశు మందిర్ మాత్రమే. శిశు మందిర్ లు లేకపోతే సమాజం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. అట్లాంటి శిశు మందిర్ ల ఏర్పాటుకు ప్రభుత్వం నుండి సహకారం లేకపోవడం బాధాకరం. అదే ప్రభుత్వం ఉగ్రవాదానికి బీజం వేస్తున్న మదర్సాలకు మాత్రం భారీ ఎత్తున నిధులిస్తుండటం శోచనీయం. చీపురపుల్లతో ఏకే 47లు తయారు చేసేంతటి శిక్షణనిస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న మదర్సాలకు నిధులివ్వడం ఎంత వరకు సమంజసం?
నేను శిశు మందిర్ విద్యార్ధినని గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. నాతోపాటు మా అన్నయ్యలు, అక్క కూడా శిశు మందిర్ లోనే చదువుకున్నరు. 1 కోటి 30 లక్షల రూపాయలతో వ్యయంతో ఈరోజు గర్ల్స్ హాస్టల్ భవనం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. పూర్తి స్థాయిలో రెసిడెన్షియల్ స్కూల్ గా మారడంవల్ల దూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వచ్చి ఈ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నారు. కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్లసహా ఉమ్మడి జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుండి ఇక్కడికి చదువుకుంటున్నారు. యోగా, శాఖ, సాంస్క్రతిక కార్యక్రమాలతోపాటు వ్యవసాయాన్ని కూడా నేర్పించడం ఈ స్కూల్ ప్రత్యేకత.
1973లో ఇక్కడ సరస్వతి శిశు మందిర్ ప్రారంభమైంది. పదేళ్ల తరువాత 1983లో విద్యారణ్య ఆవాస కేంద్రాన్ని 41 మంది విద్యార్థులతో ఏర్పాటు చేసుకున్నరు.. ఆనాడు 4, 5, 6 తరగతులే ప్రారంభించుకున్నం. ప్రస్తుతం ఈ అవాస కేంద్రంలో 360 మంది బాలురు, 150 మంది బాలికలతో కలిసి మొత్తం 510 మంది విద్యార్ధులకుపైగా చదువుకోవడం సంతోషంగా ఉంది.
1981లో అప్పటి జిల్లా కలెక్టర్ శర్మగారు ఈ కేంద్రం కోసం 20 ఎకరాల స్థలాన్ని మంజూరు చేశారు. నాటి ప్రభుత్వ ధర చెల్లించి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు.
ఇక్కడ చదువుకున్న వాళ్లలో ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, రాజకీయ నాయకులయ్యారు. విదేశాల్లో సొంతంగా కంపెనీలు ఏర్పాటు చేసుకుని ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తూ స్థిరపడ్డ వాళ్లు కూడా ఉన్నారు. సంతోషకరమైన విషయమేందంటే… శిశు మందిర్ లో చదువుకున్న వాళ్లు ఏ రంగంలో ఉన్నా సరే…జాతీయవాద భావజాలంతో పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉంది.
ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం దక్షిణ మధ్య క్షేత్ర కార్యదర్శి శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు, జమ్మికుంట తహసిల్దార్ రమేష్ ,శ్రీ సరస్వతి శిశు మందిర్ జిల్లా కార్యదర్శి తేలే రాజమౌళి, డాక్టర్ చి టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆకుల రాజయ్య, చిదురాల భాస్కర్, చిన్నపరెడ్డి, నాతాడి మంజుల, ఆవాల రాజారెడ్డి, ఆకుల రాజేందర్ ,శీలం శ్రీనివాస్, డాక్టర్ పచ్చిగా శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ కనబోయిన తిరుపతి, కట్టంగూరు దేవేందర్ రెడ్డి, డాక్టర్ వేముల రఘుపతి రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పుప్పాల రఘు, ఎర్రబెల్లి సంపత్ రావు, జీడి మల్లేష్, పొన్నగంటి రవి మరియు ప్రధాన ఆచార్యులు సుధాకర్ రావు గారు పాల్గొన్నారు