కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల కోరికలు నెరవేర్చాలి.
జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 23 జూలై
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉద్యోగం నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్ లలో వయస్సు మినహాయింపుతో ఉద్యోగాల భర్తీ నిమిత్తమై నోటిఫికేషన్లు జారీ చేయాలని పెద్ద మొత్తంలో నిరుద్యోగులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన ఉద్యోగాలు మనమే చేసుకుందాం.. అనే ధోరణిలో ప్రభుత్వం నడవాలని కోరుతున్నారు.
నిరుద్యోగులను తన కళ్ళల్లో పెట్టుకుని చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరుతున్నారు.
ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని వయస్సు సడలింపు తో ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తు చేశారు. గత బి.ఆర్.ఎస్. ప్రభుత్వంలో నోటిఫికేషన్లు లేకపోవడంతో వయస్సు మీరడంతో ఉద్యోగాలకు దూరమయ్యామని నిరుద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నిరుద్యోగ వయోపరిమితిని 45-48 సంవత్సరాలకు పెంచాలని “డిమాండ్” చేస్తున్నారు.
ఆ పైబడిన నిరుద్యోగులకు ప్రతినెలా నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరుతున్నారు. ఎక్కువ మొత్తంలో విద్య, వైద్య రంగాలలో మరియు పంచాయతీరాజ్ శాఖ, రెవిన్యూ విభాగాలలో ఖాళీల వివరాలను సేకరించి వీలైనంత త్వరగా జాబ్ నోటిఫికేషన్ లను విడుదల చేయాలి.
లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.