అనంతపురం,ఆగస్టు 03 జనసముద్రం న్యూస్:
చంద్రబాబు తన హయాంలో ప్రాజెక్టుల పేరుతో నీళ్లు కాకుండా నిధులు పారించారు. సేకరించిన భూములకు నయాపైసా కూడా పరిహారం ఇవ్వలేదు. మీరు అవినీతి చేసుకునేందుకు మా భూములు తీసుకున్నారా? అంటూ చంద్రబాబును రైతులు నిలదీయాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, శంకరనారాయణ , కాపు రామచంద్రారెడ్డి , సిద్దారెడ్డి , తిప్పేస్వామి, ఎమ్మెల్సీ మంగమ్మ పిలుపునిచ్చారు. అనంతపురంలోని వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యేలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ… చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి పూర్తి చేసినట్లు చెప్పుకునే ప్రాజెక్ట్ ఒక్కటీ లేదు. రామారావు 40 టిఎంసిలతో హంద్రీ–నివా ప్రాజెక్టుకు డిపిఆర్ సిద్ధం చేసినా….చంద్రబాబు రైతు వ్యతిరేకి కాబట్టే 98లో తాగునీటి ప్రాజెక్టుగా మార్పు చేసి ఆత్మకూరులో శిలాఫలకం వేశారు. అందులో చంద్రబాబు మోసం ఏంటంటే… శ్రీశైలం నుంచి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు తీసుకొచ్చి తాగునీరు ఇవ్వాలనే ధ్యాసలేదు. కేవలం రైతులను మోసగించి జిల్లాకు ఎక్కడో ఒకచోట 30–40 కిలోమీటర్లు కాలువ తవ్వి పనులు ప్రారంభించి ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని ఎత్తుగడ వేశారు. శ్రీశైలం నుంచి చిత్తూరు జిల్లా వరకు దాదాపు 560 కిలోమీటర్లు దూరం ఉంది. అయితే జీఓలో కేవలం 125 కిలోమీటర్లకు మాత్రమే కనబరిచారు. పత్తికొండ ప్రాంతంలో 30 కిలోమీటర్లు, ఆత్మకూరు, పెనుకొండ ప్రాంతాల్లో 60 కిలోమీటర్లు, చిత్తూరు జిల్లాలో 30 కిలోమీటర్లు కాలవ తవ్వించారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి 60 వేల కోట్లు ఖర్చు చేసి దాదాపు 63 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి అందులో 23 ప్రాజెక్టులు పూర్తి చేశారు. తక్కిన ప్రాజెక్టులు 60 నుంచి 80 శాతం వరకు పనులు పూర్తి చేశారు.
మన జిల్లాలో జీడిపల్లి రిజర్వాయర్ వరకు హంద్రీ–నివా మొదటిదశ పనులు పూర్తి చేయించి కృష్ణా జలాలు తీసుకొచ్చారు. ఆయన మరణించిన తర్వాత కూడా వైయస్ రాజశేఖర్‌రెడ్డి రైతులకు మంచి చేశారని మెచ్చుకోవాల్సింది పోయి వైయస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పనులు నత్తనడక సాగాయంటూ విమర్శలు చేస్తారా?. వైయస్ రాజశేఖర్‌రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి మిగిలిపోయిన 30 శాతం పనుల కోసం టెండర్లు పిలిచేందుకు వందరెట్లు నుంచి వెయ్యిరెట్లు అంచనాలు పెంచుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి గారి హయాంలో 60 వేల కోట్లు ఖర్చు చేసి 70 శాతం పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులకు సంబంధించి 30 శాతం పనుల్లో 15 శాతం పనుల కోసం చంద్రబాబు 60 వేల కోట్లు ఖర్చు చేశారు. ఈయన చుట్టూ ఉన్న ఇరిగేషన్ కాంట్రాక్టర్లు ప్రైవేట్ విమానాలు కొన్నారు. జాతీయస్థాయికి ఎదిగిపోయారు.
జీడిపల్లి అప్పర్ పెన్నార్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరుతో 1300 కోట్ల రూపాయలతో డీపీఆర్ ఇచ్చారు. దీనిపై ఆరోపణలు రావడంతో మళ్లీ 800 కోట్లకు మార్పు చేసి జీఒ ఇచ్చారు. కేవలం 10 కోట్ల రూపాయల ఖర్చుతో పేరూరు డ్యాంకు హంద్రీ–నివా నీళ్లు ఇవ్వొచ్చని నేను అనేక సందర్భాల్లో చెప్పాను. స్వయంగా చంద్రబాబు దృష్టికి విలేకరులు కూడా తీసుకొచ్చారు. ఇవేవీ పట్టించుకోలేదు. మేము అధికారంలోకి రాగానే పేరూరు డ్యాంకు ఒక టీఎంసీ నీటిని కేటాయిస్తూ జగనన్న జీఒ ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారమే ప్రభుత్వం నుంచి రూపాయి డబ్బు తీసుకోకుండా దాతలు, రైతుల సహకారంతో పెన్నానదిలో 40 కిలోమీటర్ల కాలవ తవ్వించి జగనన్న ఆశీస్సులతో పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చాం.
‘1999లో ఎన్నికలకు ముందు 1998లో ఆత్మకూరు సమీపంలో హంద్రీ–నివా పథకానికి సంబంధించిన శిలాఫలకం వేశారు. పేరూరు డ్యాంకు నీళ్లు ఇస్తామని 2019లో ఎన్నికలకు ముందు శిలాఫలకం వేశారు. హంద్రీ–నివా కాలువను వెడల్పు చేసేందుకు కూడా శిలాఫలకం వేశారు. ఇలా శిలాఫలకాలు వేయడం..వీలైనంత వరకు నిధులు పారించడం తప్ప నీళ్లు పారించలేదు. చంద్రబాబు ఏ ప్రాజెక్టునూ తెచ్చింది లేదు..పూర్తి చేసింది లేదు’’. లోకేష్‌బాబు పాదయాత్ర చేసుకుంటూ వచ్చాడు. ఆయన రాయలసీమ దాటేదాకా మేఘాలు పారిపోయాయి. తీరా విత్తనాలు వేసుకోవాల్సిన సమయంలో వర్షాలు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయన రాయలసీమ దాటిన తర్వాత వర్షాలు పడ్డాయి. కరువు కరాళ నృత్యం చేస్తుందనే ఇమేజ్ చంద్రబాబుకు ఉంది. ఇలాంటి సమయంలో ఆయన వస్తే వర్షాలు రాకుండా పోతాయనే భయంతో మంచి ఉద్దేశంగా ఆయనకు విజ్ఞప్తి చేశాం. అయినా ఆయన రాదలచుకున్నారు. రైతులు చంద్రబాబును అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ , మాజీ ఎంఎల్‌ఎ విశ్వేశ్వరరెడ్డి , జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ దీపిక, ఏడిసిసి బ్యాంకు చైర్మన్ లిఖిత పాల్గొన్నారు