జనసముద్రం న్యూస్,మే 23:

ఏపీలో జగన్ కి ఆదరణ ఉంది. ఎందుకంటే ఆయనే బటన్ నొక్కి నగదు నేరుగా లబ్దిదారుల ఖాతాలో వేస్తారు కాబట్టి. ఏ తప్పు జరిగినా ఎమ్మెల్యేలనే ముందు పెట్టి అడుగుతారు ప్రజలు. సీఎం మాత్రం వారికి మంచిగానే కనిపిస్తారు. ఏది అడిగినా కాదనని మనస్తత్వం జగన్ ది అని జనాలు అనుకుంటున్నారు.
ఆ విధంగా చూస్తే జగన్ జనాలకు చాలా ఇష్టమైపోతున్నారు. జగన్ ముద్దు కానీ లోకల్ ఎమ్మెల్యేలే వద్దు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. నిజానికి ఏపీలో 151 సీట్లను వైసీపీ గెలిస్తే సగానికి సగం సీట్లలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని అంటున్నారు.అక్కడ లోకల్ ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఇదే ఇపుడు వైసీపీకి అతి పెద్ద సమస్యగా పుట్టె ముంచేదిగా కనిపిస్తోంది అని అంటున్నారు. జగన్ ఇష్టమే ఆయన లీడర్ షిప్ ఓకే అని అంటున్నా అన్ని చోట్లా ఆయన ఎమ్మెల్యేగా నిలబడి పోటీ చేయరు కదా. లోకల్ ఎమ్మెల్యేకు వాల్యూ ఉండాలి. ఆ విధంగా చూస్తే వారిని ప్రోత్సహించాలి. వారి విషయంలో సానుకూలత ఉంటేనే వైసీపీకి మేలు జరుగుతుంది.
కానీ నాలుగేళ్ల వైసీపీ ఏలుబడిలో జగన్ సక్సెస్ అయితే ఎమ్మెల్యేలు మాత్రం ఫిఫ్టీ పెర్సెంట్ ఫెయిల్ అయ్యారని నివేదికలు వస్తున్నాయి. అంతే కాదు వారి మీద ఫుల్ నెగిటివిటీ ఉందని కూడా అంటున్నారు. ఉదాహరణకు చూసుకుంటే శ్రీకాకుళంలోని ఎచ్చేర్ల ఎమ్మెల్యే మీద జనాలకు వ్యతిరేకత ఉంది. అంతే కాదు పార్టీ నేతలు కూడా మాకొద్దీ ఎమ్మెల్యే అంటున్నారు. అది ఈ రోజు వ్యవహారం కాదు గత ఏడాది నుంచి సాగుతోంది. గడప గడపకు అంటూ ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ ఇల్లిల్లూ తిరగాలని చూస్తే చాలా చోట్ల ఆయన రాకుండా అడ్డుకున్నది ప్రత్యర్ధులు అయితే కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలు అని అంటున్నారు.
అదే విధంగా ఇపుడు ర్యాలీలు తీసి పార్టీని బజారుకు ఈడుస్తున్నదీ వారే అంటే ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. ఇక్కడ వీరు అంటోంది ఏంటి అంతే జగన్ మాకు ముద్దు ఎమ్మెల్యే మాత్రం వద్దు అని. ర్యాలీ తీసి మీటింగ్ పెట్టిన వైసీపీ నాయకులు ఆయన్ని ఈసారి మార్చేయాలని జగన్ని కోరడం విశేషం. ఎచ్చెర్ల జి సిగడం మండలాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు అంతా ఈ మీటింగుకు ర్యాలీకి హాజరు కావడం విశేషం.ఇదే తీరున పాతపట్నంలో కూడా ఉంది. ఇక్కడ జనంలో ఎమ్మెల్యే అంటే ఎవరికీ ఇష్టం ఉండడంలేదు. ఆమెను నాన్ లోకల్ గా ముద్ర వేస్తున్నారు. ఇక వైసీపీ నేతలు కూడా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి పట్ల వ్యతిరేకంగానే ఉన్నారు. ఎంత వ్యతిరేకత లేకపోతే రెడ్డి శాంతి కుమారుడు ఒక్కటే శ్రీకాకుళం నుంచి జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలో ఓటమి పాలు అయ్యారో అర్ధం చేసుకోవాలి.
అదే విధంగా విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వద్దు అని సొంత పార్టీలోని వారే డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని ఆయన పక్కా నాన్ లోకల్ అని అంటున్నారు. విశాఖ విషయానికి వస్తే మంత్రి గుడివాడ అమరనాధ్ మీద కూడా అనకాపల్లిలోని సీనియర్ వైసీపీ నేతలు గుర్రు మీద ఉన్నారు మాకొద్దీ ఎమ్మెల్యే అని వారు చెప్పేస్తున్నారు. ఇలా ఒక చోట కాదు ఏపీ మొత్తం అలాగే ఉంది.మరి జగన్ ఈ విషయాలను ఎలా పరిగణనలోకి తీసుకుంటారో ఎలా ఈ వివాదలను సర్దుబాటు చేసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా జగన్ ముద్దు ఎమ్మెల్యేలు వద్దు అని సొంత పార్టీ వారే అనడం అంటే అది పార్టీకి చెడు సంకేతమే అని అంటున్నారు.





