జనసముద్రం న్యూస్, మే 22:

తెలుగు వారి ఇలవేల్పు తెరవేల్పు.. తెలుగింటి అన్నగారు నందమూరి తారకరామారావు. ఆయన శత జయంతి వేడుకలను ఊరూ వాడా ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాద్కు నూతన రూపును ఇచ్చి.. ట్యాంక్ బండ్పై తెలుగు ప్రముఖుల విగ్రహాలను నెలకొల్పి.. హుస్సేన్ సాగర్లో బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ప్రత్యేక సొబగులు అద్దిన అన్నగారికి అంతే ప్రత్యేక గౌరవం ఇవ్వాలని.. టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్ నేతృత్వంలో ఏర్పాటైన శత జయంతి ఉత్సవాల కమిటీ నిర్ణయించింది.ఈ క్రమంలో హైదరాబాద్ శివారులో అన్నగారి 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ తలపోసింది. ఈ నిర్ణయం పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఆయన వెల్లడించారు.
తాజాగా కేపీహెచ్బీలో జరిగిన శత జయంతి కార్యక్రమంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. అయితే..ఇప్పటికే పార్టీ తరఫున ప్రతి జి్ల్లాలోనూ అన్నగారి విగ్రహాలు ఏర్పాటు చేశారు. కానీ ఇంత భారీ స్థాయిలో అంటే.. 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలి సారి అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 అడుగులు అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలను 100 నగరాల్లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో 50 కార్యక్రమాలను అమెరికాలోని ప్రధాన నగరాల్లో నిర్వహించేలా ప్లాన్ చేశారు. అగ్రరాజ్యంలో తెలుగుకు దక్కిన ప్రాధాన్యం నేపథ్యంలో(అక్కడి 20వ భాషగా తెలుగుకు గుర్తింపు వుంది) అన్నగారి శత జయంతికి అక్కడ నిర్ణయించాలని తీర్మానం చేశారు. ఇక మిగిలిన 50 నగరాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి.
ఇదిలావుంటే కేపీహెచ్బీలో నిర్వహించిన అన్నగారి శతజయంతి వేడుకలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వడం అవసరమని పేర్కొన్నారు. ఈ పురస్కారం దక్కేవరకు పోరాడతామని తెలిపారు. ఇది ఇచ్చి ఉంటే.. దేశానికే గర్వకారణ మని పేర్కొన్నారు. శతజయంతి వేడుకల్ని ఎలాంటి లోపం లేకుండా గొప్పగా చేశారంటూ నిర్వాహకుల్ని ప్రశంసించారు చంద్రబాబు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు శక్తి అంటూ కీర్తించిన చంద్రబాబు.. తెలుగు జాతి ఉన్నంత వరకు అందరి గుండెల్లో శాశ్వితంగా నిలిచిపోతారన్నారు





