
ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వెల్లడి
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :19
రాష్ట్రంలో అన్ని దేవాలయాలను అభివృద్ధి చేసిన మాదిరిగానే ఏడు పాయల వనదుర్గామాత ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు పూనుకుంటారని ఎమ్మెల్సీ,సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి,వెల్లడించారు.ఏడుపాయలకు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వచ్చిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజల కొంగుబంగారమైన ఏడుపాయల దుర్గామాతను దర్శించుకోవడం మహాభాగ్యంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు.ప్రభుత్వం తరఫున ఇక్కడికి రావాల్సిన నిధులు కొంచెం ఆలస్యమైనప్పటికీ అన్నీ వస్తాయన్నారు.త్వరలో సీఎం కేసీఆర్ ఏడుపాయలకు రానున్నారని తెలిపారు.మంజీరా నది ఏడుపాయలుగా చీలి గరుడ గంగగా వెలసిన వనదుర్గా మాత ఆశీర్వాదం రాష్ట్ర ప్రజల పైన ఈ ప్రాంత ప్రజలందరిపై చల్లని చూపు చూడాలని, పాడిపంటలు మంచిగా పండాలని రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కినట్లు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తెలిపారు. ఆలయం ముందున్న మంజీరా నది పాయలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివుని వద్ద సుభాష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఏడుపాయల చైర్మన్ సాతేల్లి బాలాగౌడ్,బిఆర్ఎస్ నాయకులు పుల్లన్నగారి ప్రశాంత్ రెడ్డి,సర్పంచ్ లు,ఎంపిటిసిలు,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






