జనసముద్రం న్యూస్,జనవరి 11:
గత ఎన్నికల్లో పోలీసు విభాగం నుంచి వచ్చిన ముగ్గురు నేతలకు వైసీపీ టికెట్ ఇచ్చింది. వీరిలో ఒక్కరు మాత్రమే విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈయన కూడా పార్టీకి మచ్చతెచ్చే పనిచేశారు. అయితే.. పార్టీకి బీసీలు అవసరం కాబట్టి.. వారిలో ఎలాంటి వ్యతిరేకత రాకూడదనే వ్యూహంతో ఆయనను పార్టీ నుంచి పంపించలేక.. మౌనంగా భరిస్తున్నారనే వాదన పార్టీలో వినిపిస్తోంది.
అయితే.. వచ్చే ఎన్నికల్లో మాత్రం పోలీసు విభాగం నుంచి వచ్చిన రావాలని అనుకుంటున్న వారికి కూడా టికెట్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణం.. వారి విషయంలో ప్రజలుసానుకూలంగా లేరని అందుతున్న రిపోర్టులే కారణమని అంటున్నారు. ఉదాహరణకు గుంటూరు వెస్ట్ నుంచి గత ఎన్నికల్లో మాజీ పోలీసు అధికారికి చంద్రగిరి ఏసురత్నానికి టికెట్ ఇచ్చారు. ఈయన ఓడిపోయారు.వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆయన గ్రాఫ్ను పరిశీలించిన వైసీపీ వద్దని చెప్పేందుకు రెడీ అవుతోంది. ప్రజల్లో ఇమేజ్ పెరగకపోగా.. ఆయన వైఖరి పార్టీలో నేతలకు నచ్చడం లేదని టాక్. దీంతో ఏసురత్నాన్ని.. మళ్లీ చైర్మన్గా చేయడమే ఉత్తమమని తెలుస్తోంది. ప్రస్తుత పదవి వచ్చే ఏడాదితో ముగియనుంది.
హిందూపురం అసెంబ్లీ నుంచి మాజీ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ను నిలబెట్టారు. ఈయన కూడా ఓడిపోయారు. ఇప్పుడు మరింత వివాదం అవుతున్నారు. సొంత పార్టీ నాయకులు.. ఆయనను తప్ప ఎవరిని నిలబెట్టినా.. గెలిపిస్తామని చెబుతున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం.. ఆయనను కూడా వద్దని చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అదేవిధంగా హిందూపురం ఎంపీగా ఉన్న మాజీ సీఐ గోరంట్ల మాధవ్ను ఈ సారి పోటీ నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. ఆయనను రాజ్యసభకు పంపించే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మాధవ్ కూడా దీనికి అంగీకరించినట్టు సమాచారం.