జనసముద్రం న్యూస్,జనవరి 9:
ఈ శీతాకాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి చంపేస్తోంది. భారత్ లోని పలు రాష్ట్రాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. ఉదయం 10 గంటలైనా భానుడు కన్పించని పరిస్థితులు నెలకొంటున్నాయి. మంచు కారణంగా ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు వృద్ధులు.. చిన్నారులు చలికి గజగజ వణికిపోతున్నారు. అస్తమా.. శ్వాసకోశ సమస్యలతో ఉన్నవారు చలి కారణంగా మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు అనారోగ్య బారిన పడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. కాగా గత ఐదు రోజుల్లోనే కాన్పూర్లో గుండె.. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా 98 మంది మృతి చెందాడం ఆందోళనను రేపుతోంది.కాన్పూర్లోని లక్ష్మీపత్ సింఘానియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ కార్డియాక్ సర్జరీ విడుదల నివేదిక ప్రకారంగా వివరాలిలా ఉన్నాయి. గత వారంలో 723 మంది గుండె సంబంధిత రోగులు ఆస్పత్రిలో అత్యవసరంగా చేరారు. వీరిలో 98 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. 44 మంది ఆస్పత్రిలో మరణించగా 54 మంది చికిత్సకు ముందే మృతిచెందినట్లు వెల్లడించారు.
తీవ్రమైన జలుబు లక్షణాలతో బాధపడుతున్న 14 మంది రోగులు శనివారం గుండెపోటుతో మరణించారు. అలాగే హార్ట్ డిసీజ్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతిచెందగా ఇన్స్టిట్యూట్లో 8మంది చనిపోయినట్లు పేర్కొన్నారు. నగరంలోని ఎస్పిఎస్ హార్ట్ ఇనిస్టిట్యూట్లోనే గడిచిన 24 గంటల్లో 14 మంది రోగులు మృతి చెందాడం గమనార్హం.ప్రస్తుతం హార్ట్ డిసీజ్ ఇన్స్టిట్యూట్లో 604 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 54 మంది కొత్త రోగులు కాగా 27 మంది పాత రోగులు ఉన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో చలి నుంచి రోగులకు రక్షణ కల్పించాలని కార్డియాలజీ డైరెక్టర్ వినయ్ కృష్ణ సిబ్బందికి సూచించారు.
ఇదే విషయంపై లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ అధ్యాపకుడు ఒకరు మాట్లాడుతూ ఈ చలిలో వచ్చే గుండెపోటు కేవలం వృద్ధులకే పరిమితం కాదన్నారు. యుక్త వయస్సున్న వారికి సైతం గుండెపోటు వచ్చే సందర్భాలు ఉన్నాయని తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు వెచ్చగా ఉండే ప్రాంతంలో ఉండాలన్నారు. అనవసరంగా చలిలో బయట తిరగవద్దని సూచించారు.