జనసముద్రం న్యూస్,జనవరి 9:
రాజకీయ మేధావిగా పేరుతెచ్చుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్.. ఆ రాష్ట్రంలో కుల గణన చేపట్టి దేశంలో టాక్ ఆఫ్ది సెంట్రిక్గా నిలిచారు. ఎవరూ చేయని సాహసం చేశారంటూ.. ఆయన చుట్టూ ప్రశంసలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇంతలోనే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా బద్నాం అయ్యారు. దేశంలో జనాభా పెరిగిపోతోందని అన్న ఆయన దీనికి కారణం మహిళలేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పనిలేని మహిళలకు పిల్నల్ని కనడమే పని అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతటితో కూడా ఆగకుండా.. మహిళలు చదువుకోకపోవడంతోపాటు పురుషులు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల జనాభా నియంత్రణ సాధ్యంకావడం లేదని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేపట్టిన ‘సమాధాన్ యాత్ర’లో భాగంగా వైశాలిలో జరిగిన బహిరంగ సభలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలు చదువుకుంటే సంతానోత్పత్తి రేటు తగ్గుతుందన్నారు. ఇది వాస్తవమని నేడు మహిళలు చదువుకోవడం లేదని అన్నారు.ప్రతిరోజూ పిల్లల్ని కనడమే మహిళలు పనిగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఇక పురుషులు కూడా ఇదే విషయాన్ని అనుసరిస్తున్నారని వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులైతే లేదా గర్భధారణను నిరోధించేందుకు ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు పాటించాలో తెలిస్తే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందన్నారు.
ఇక నితీష్కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. దేశంలో సంతానోత్పత్తి రేటు గురించి వివరించడానికి సరైనది కానటువంటి భాషను ఆయన ఉపయోగించారని ఆరోపించింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అమర్యాదకరమైన భాషను బహిరంగంగా ఉపయోగించారని ఆరోపించారు. ఇటువంటి భాషను ఉపయోగించడం ద్వారా ఆయన ముఖ్యమంత్రి పదవి ఔన్నత్యానికి కళంకం తెస్తున్నారన్నారు. ఆయనలో నైతికత ఉంటే రాజీనామా చేయాలన డిమాండ్ చేశారు.