జనసముద్రం న్యూస్,జనవరి 5:
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 1/2023 తీవ్ర వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీనిని కేవలం ప్రతిప క్షాలను అడ్డుకునేందుకు మాత్రమే తీసుకువచ్చారని ఆయా పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక కుప్పంలో చంద్రబాబును కూడా ఇదే జీవోను చూపించి పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు జీవోపై జనసేనాని పవన్ కళ్యాణ్.. తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.
జీవో1 పేరుతో ఆంక్షలు విధించటంపై ఆయన స్పందించారు. ఆంక్షల పేరుతో చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకున్నారని జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆంక్షలు ఉంటే పాదయాత్ర కొనసాగేదా అని ప్రశ్నించారు. ”ప్రతిపక్షాల గొంతు వినిపించకూడదు.. ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిం చకూడదనే ఉద్దేశ్యంతోనే.. జీవో 1ని తీసుకొచ్చారు” అని పవన్ వ్యాఖ్యానించారు.చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించటం ఆయన డ్యూటీ.. దానిని జీవోల పేరిట అడ్డుకుంటారా అని పవన్ నిలదీశారు. జీవోల పేరు చెప్పి చంద్రబాబు కుప్పం పర్యటన చేయకుండా అడ్డుకున్నారని విమర్శించారు.
ఇవే జీవోల ఆంక్షలు జగన్రెడ్డికి వర్తించవా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో జగన్ పర్యటన జీవో ఉల్లంఘన కిందకు వస్తుందో రాదో పోలీసులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తుంటే ప్రశ్నించటం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని పవన్ అన్నారు. చీకటి ఉత్వర్వులు ఇవ్వకుండానే గతంలో.. ఇందులోని దురుద్దేశాలను చూపించారని విమర్శించారు. విశాఖ నగరంలో హోటల్ నుంచి బయటకు రాకూడదని.. ప్రజలకు అభివాదం చేయకూడదని నిర్బంధాలు విధించారని నాటి సంఘటనను పవన్ గుర్తు చేసుకున్నారు.