జనసముద్రం న్యూస్, డిసెంబర్ 30:
ప్రధాని నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి హీరాబెన్ (100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురి కావడంతో అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే.
ఆమె ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు వైద్యులు వెల్లడించినప్పటికీ డిసెంబర్ 30న ఉదయం ఒక్కసారిగా క్షీణించడంతో కన్నుమూశారు. అక్కడ చికిత్స పొందుతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస మరణించారు. ఇటీవలే ఆమె తన వందో పుట్టినరోజు వేడుకలను చేసుకున్నారు.తన తల్లి హీరాబెన్ మృతి చెందడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈరోజు తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నింటినీ నరేంద్ర మోదీ రద్దు చేసుకున్నారు. హీరాబెన్ మృతిపై దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మోదీకి సంతాపం తెలుపుతున్నారు.
కాగా తన మాతృమూర్తి హీరాబెన్ కన్నుమూతపై ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. ”నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తి చేసుకుని దేవుడి చెంతకు చేరారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిది. సన్యాసిలా కర్మయోగిలా విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారు. ఆమెలో త్రిమూర్తులు ఉన్నట్లు భావిస్తున్నా” అని ప్రధాని ట్విటర్లో పేర్కొన్నారు.
కాగా ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అంతిమ యాత్ర ప్రారంభమైంది.గుజరాత్ గాంధీనగర్లోని ఆమె నివాసం నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని తన మాతృమూర్తి పాడె మోశారు. అంతిమ యాత్ర వాహనంలోనూ తన మాతృమూర్తి పార్థివదేహం వద్దనే కూర్చొని మోదీ భావోద్వేగానికి గురయ్యారు.
ప్రధాని మోదీ మాతృమూర్తి మరణంతో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సోషల్మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.