జనసముద్రం న్యూస్,డిసెంబర్ 2 :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ పీజీ మెడికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు టీ షర్టులు ధరించకూడదని రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) సంచలన ఆదేశాలు జారీ చేసింది.
అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు వైద్య విద్యార్థినులు.. చీర లేదా చుడీదార్లు మాత్రమే ధరించాలని ఏపీ డీఎంఈ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో జరిగిన వారాంతపు సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ ఆదేశాలను అన్ని బోధనాసుపత్రులకు పంపారు. తప్పనిసరిగా ఈ డ్రస్ కోడ్ను పాటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
నిర్దేశించిన డ్రస్ కోడ్ను కొందరు విద్యార్థినులు వైద్యులు పారామెడికల్ సిబ్బంది పాటించకపోవడాన్ని ఉన్నతాధికారులు గుర్తించారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే తప్పనిసరిగా డ్రస్ కోడ్ను పాటించాలని ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది.
బోధనాసుపత్రులకు వచ్చే రోగులను ఇన్పేషంట్లుగా చేర్చుకోవాల్సి వస్తే.. సహాయకులు లేరని తిరస్కరించొద్దని డీఎంఈ సూచించింది. అలాగే ఫేసియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (ముఖ ఆధారిత హాజరు) విధానాన్ని అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు డీఎంఈ డాక్టర్ వినోద్కుమార్ బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు ప్రిన్సిపాళ్లకు ఆదేశాలిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా శాఖ ఆదేశాలు ఇవి..
– ఎంబీబీఎస్ పీజీ వైద్య విద్యార్థులు శుభ్రంగా ఉండే దుస్తులు వేసుకోవాలి.
– అబ్బాయిలు గడ్డం గీసుకోవాలి.
– మహిళలు జుట్టు వదిలేయకూడదు.
– తప్పనిసరిగా వైద్య విద్యార్థులంతా స్టెతస్కోప్ యాప్రాన్ను ధరించాలి.
ఈ ఆదేశాలపై వైద్యులు వైద్య విద్యార్థులు వైద్య సంఘాలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే. ఏపీ ప్రభుత్వం వైద్య విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 26 జిల్లాల్లోనూ ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా డ్రస్ కోడ్ను అమల్లోకి తెచ్చింది.