
ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి
జగిత్యాల నవంబర్ 15 జన సముద్రం జిల్లా ప్రతినిధి
ఆధునిక యుగంలో నేరాల నియంత్రణ, కేసుల ఛేదన, ప్రజా భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాల వినియోగం అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. ప్రతి పట్టణం,ప్రతి గ్రామం సీసీ కెమెరాలతో నిండినప్పుడు పోలీసింగ్ మరింత సమర్థవంతంగా మారుతుందని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన 123 నూతన సీసీ కెమెరాలను ఈరోజు ఎస్పీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా గా ఎస్పీ మాట్లాడుతూ….
ప్రజల రక్షణకు,నేరాల అరికట్టడానికి సీసీ కెమెరాలు అమూల్యమైన సాధనాలు అని. ప్రతి వీధి, ప్రతి మూలలా కెమెరాలు అమర్చడం వలన నేరం జరిగిన వెంటనే గుర్తించడం, నిందితులను పట్టుకోవడం చాలా వేగంగా జరుగుతోంది అన్నారు.సీసీ కెమెరాలు లేకపోయి ఉంటే కేసులు ఛేదించడం లో ఆలస్యం జరిగేది,కానీ ఇప్పుడు వాటి సహాయంతో విచారణ చాలా వేగంగా జరుగుతోంది” అని అన్నారు.
ఇప్పటికే జగిత్యాల ,మెట్ పల్లి, ధర్మపురి,ఈరోజు కోరుట్ల లో పెద్ద మొత్తంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని,సీసీ కెమెరాల ఏర్పాటు వలన దొంగతనాలు,చోరీలు, గొడవలు,రోడ్డు ప్రమాదాలు వంటి ఘటనల్లో నిందితుల కదలికలు రికార్డ్ అయి పోలీసులు వెంటనే గుర్తించి అరెస్టులు చేయగలిగిన అనేక ఉదాహరణలు ఉన్నాయని అన్నారు.
“కెమెరాలు పోలీసుల ‘మూడో నేత్రం’. ఏ సమయంలోనైనా, ఏ చోటైనా నేరాలు జరగకుండా ముందుగానే హెచ్చరికగా పనిచేస్తాయి అని, ఇవి ఉన్నాయన్న భయం నేరస్థుల్లో ఉంది అని పేర్కొన్నారు.
ప్రజలు తమ ఇళ్లకు, వ్యాపార సంస్థలకు, అపార్ట్‌మెంట్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వ్యక్తిగత భద్రతతో పాటు సమాజ భద్రత కూడా బలోపేతం అవుతుందని సూచించారు. ప్రత్యేకంగా ప్రధాన రహదారులు, క్రాస్ రోడ్లు, బిజీ సెంటర్లు, మార్కెట్ ఏరియాల్లో కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అవసరం అని తెలిపారు.
కొత్తగా కోరుట్ల లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన స్థానిక డాక్టర్లు ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, ఇతర సంస్థల ప్రతినిధులను ఎస్పీ అభినందించారు. “ఈ వ్యవస్థ ప్రజల సహకారం లేకుండా చేయడం చాలా కష్టం అని, మీరు చూపిన చొరవ అభినందనీయం.ఇదే స్ఫూర్తితో కోరుట్ల పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ముందుకు రావాలి” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మెట్ పల్లి డిఎస్పీ రాములు,కోరుట్ల సీ.ఐ సురేష్ బాబు, ఎస్.ఐ లు చిరంజీవి,రామచంద్రం, స్థానిక డాక్టర్లు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, పాల్గొన్నారు.






