జన సముద్రం న్యూస్ మంచిర్యాల జిల్లా ప్రతినిధి 27, 2025:
ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం రోజున జిల్లాలోని చెన్నూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, రిజిస్టర్లు, మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు అందించే ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తో కలిసి పట్టణంలో అమృత్ 2.0లో భాగంగా చేపట్టిన నీటి ట్యాంక్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో నల్లా కనెక్షన్ల ద్వారా ఇంటింటికి శుద్ధమైన త్రాగునీటిని అందించడం జరుగుతుందని, అమృత్ 2.0 ద్వారా అన్ని నివాసాలకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో కొనసాగుతున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ తో కలిసి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, తరగతి గదులు, వంటశాల, పరిసరాలు పరిశీలించారు. విద్య రంగ బలోపేతం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహరీ గోడ, అదనపు గదులు ఇతర సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. వంట సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పాఠశాలలో పాడైన ఆర్.ఓ. ప్లాంట్ స్థానంలో క్రొత్తది ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇంటర్మీడియట్ ఎం.పి.సి. విద్యార్థులకు, 10వ తరగతి విద్యార్థులకు స్వయంగా పాఠ్యాంశాలు బోధించారు. విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






