
( జనసముద్రం న్యూస్ ప్రతినిధి )
తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న పథకాలు భారతదేశానికి రోల్ మోడల్ కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క భేటీ అయ్యారు. మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన కేంద్ర మంత్రి కాసేపు శంషాబాద్ లో ఉన్న క్రమంలో కేంద్ర మంత్రిని మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ తో కలిసి సీతక్క పలు అంశాలపై చర్చించారు. సందర్భం మంత్రి సీతక్క రాష్ట్రంలో అమలవుతున్న పథకాల వివరాలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు. ఆరోగ్యలక్ష్మి, పోషణ్ 2.0, సంక్షేమ అంగన్వాడీ వంటి పథకాల ద్వారా తెలంగాణలో మహిళా, శిశు సంక్షేమానికి ప్రభుత్వం అధిక నిధులు వెచ్చిస్తోందని ఆమె తెలిపారు.ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా అంగన్వాడీ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు కల్పిస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. అలాగే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాల్లో కేంద్ర వాటాను పెంచాలని కోరారు. అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. 10,950, రూ.6450 చెల్లిస్తుండగా కేంద్రం తన వాటాగా నామమాత్రంగా కేవలం రూ. 2700, రూ.1350 మాత్రమే చెల్లిస్తుంది. మొత్తాన్ని పెంచాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రికి సీతక్క వివరించారు. దీంతోపాటు రాష్ట్రంలో 11 వేలకుపైగా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, సొంత భవనాల నిర్మాణానికి కేంద్ర నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణీలకు బాలింతలకు 200 ఎంఎల్ విజయ మిల్క్ ను అందిస్తున్నామని. త్వరలో చిన్నారులకు సైతం పథకాన్ని వర్తింప చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని.కేంద్ర ప్రభుత్వం తన వంతు సహకారం అందించాలని మంత్రి సీతక్క కోరారు.మంత్రి సీతక్క వినతులను కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న పథకాలు అభినందనీయం అని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ మంత్రులు, అధికారులతో కలిసి తెలంగాణలో జాతీయ సదస్సు నిర్వహించి ఇక్కడి బెస్ట్ ప్రాక్టీస్ ను ఇతర రాష్ట్రాలకు పరిచయం చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అధిక నిధుల మంజూరుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి హామీ ఇచ్చారు.