
జన సముద్రం న్యూస్, పినపాక, జూన్ 21.
- కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం తరలింపు
- మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు నిమ్మల వెంకన్న.
బీటీపీఎస్ బూడిదను తరలిస్తూ ఉన్న ట్రాక్టర్ బోల్తా
పడటంతో ఆదివాసి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన
సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.ప్రత్యక్ష సాక్షులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పినపాక మండలం,బోటిగూడెం పంచాయతీ, మారేడుగూడెం కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మాడే రామారావు (48) శుక్రవారం ఉదయం బిటి పిఎస్ ఉప్పాక బూడిద చెరువు నుంచి ట్రాక్టర్ లో బూడిద బస్తాలను తరలిస్తు ఉండగా బూడిద చెరువు కట్టపై అదుపుతప్పి పల్టీ కొట్టింది.ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ మాడే రామారావు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య నర్సింహ రత్నం, కూతురు సమీరా ఉన్నారు.ఏడుళ్ల బయ్యారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం
నిమిత్తం రామారావు మృతదేహాన్ని మణుగూరు 100 పడకల ఆసుపత్రికి తరలించారు. రామారావు మృతితో మారేడు గూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుని కూతురు రోదిస్తున్న తీరు చూపరులను, గ్రామస్తులను కంటతడి పెట్టించింది. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం, బీ టీ పీ ఏస్
యాజమాన్యం ఆదుకోవాలని మారేడు గూడెం గ్రామస్తులు,ఆదివాసి సంఘాల నాయకులు కోరారు.
*మృతుల కుటుంబానికి న్యాయం చేయాలి : సిపిఎం నిమ్మల వెంకన్న.
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ రామారావు మృతి చెందడం బాధాకరమని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న అన్నారు. బి టి పి ఎస్ యాజమాన్యం మృతుని కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్లాంట్ యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో బీటీపీఎస్ ప్రమాదంలో కార్మికుడు చనిపోతే 15 లక్షల రూపాయలు నష్టపరిహారం అందజేశారని, ఇప్పుడు కూడా ప్రమాదంలో మృతి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని తెలియజేశారు.