
జూనియర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలి : దళిత బహుజన ఫ్రంట్ పల్నాడు జిల్లా కార్యదర్శి వి.మధుసూదన్ రావు డిమాండ్
జనసముద్రంన్యూస్, మే 20:
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థి జేమ్స్ పై అదే కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న జూనియర్ యశ్వంత్ నాయుడు జేమ్స్ ని కులం పేరుతో తరచూ దూషిస్తూ ఉంటే తగదని వారించినందుకు కక్ష పెంచుకున్న జూనియర్ మరో ఇద్దరు జూనియర్స్, రౌడీషీటర్స్ తో కలిసి జేమ్స్ ని కారులో కిడ్నాప్ చేసి కత్తులతో తలపై కోసి హాకీస్టిక్లు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. అంతేకాకుండా కాళ్లు,చేతులు వెనక్కి కట్టి ఒకటిన్నర రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. ఆ సమయంలో అరవకుండా అండర్వేర్ (డ్రాయర్) నోట్లో కుక్కారు. అంతేకాకుండా మూత్రం నోట్లో పోసి త్రాగించారు. ఇది చాలా అటవిక చర్య. చదువుకొని విజ్ఞానం నేర్చుకోవాల్సిన విద్యార్థులు ఇలా పనికిమాలిన అడవి జాతి మనుషుల్లాగా ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం. దీనిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నామని పలనాడు దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షులు వి. మధుసూదన్ రావు అన్నారు. పోలీసు వారు కూడా కొంతమంది పేర్లు తొలగించి, వారిపై కేసులు పెట్టలేమని చిన్న నామాత్రపు కేసులు పెట్టి, ఫిర్యాదు పై సంతకం పెట్టించుకున్నారన్నారు.
దళిత విద్యార్థి జేమ్స్ పై దాడి చేసిన వారందరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, కఠినమైన శిక్షలు అమలు చేయాలని, బాధితునికి రక్షణ కల్పించి మెరుగైన వైద్యం అందించాలని, ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని, మరలాఇలాంటి దుశ్చర్యలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని దళిత బహుజన ఫ్రంట్ పలనాడు జిల్లా కార్యదర్శి వడ్డే మధుసూదన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.