జనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా ప్రతినిధి
హుజూరాబాద్:హుజురాబాద్ మండలం రాజపల్లి గ్రామానికి చెందిన నోముల రాజు (30 )శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఉదయం తల్లిదండ్రులైన నోముల చంద్రయ్య, ఎల్లమ్మలు ఇంటిముందుకు వచ్చి మా కుమారుడు లేవడం లేదని చుట్టుపక్కల వారికి తెలిపారు. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా మంచంపై రాజు శవమై ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జి, టౌన్ సిఐ తిరుమల్ గౌడ్, ఎస్ఐ యూనస్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి.. నోముల రాజు హత్యకు గురైనట్లు గుర్తించారు. మంచంపై విగతజీవిగా ఉండగా అతని నుదిటిపై ఆయుధంతో కొట్టిన గాయాలు ఉన్నాయి. మంచం చుట్టూ రక్తం మరకలు ఉన్నాయి. గొడ్డలితో గాయపరిచి చంపి ఉంటారని పోలీసులు అనుమానించారు. మృతుని తల్లిదండ్రులు, సోదరుడు అంజిలను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. నోముల రాజు గత కొంతకాలంగా మద్యం సేవిస్తూ తల్లిదండ్రులతో గొడవ పడుతుండేవాడని తెలిసింది. సోదరుడు అంజి హైదరాబాదులో కారు నడుపుతూ జీవిస్తున్నాడని గత నాలుగు రోజులుగా ఇంటి వద్దనే ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.