ఫీజుగా రూ.50 లక్షలు, 55, 65, 85లక్షలు
50 లక్షల శ్లాబు పరిధిలో…ఎక్కువ షాపులు తిరుపతి జిల్లాలో అత్యధికంగా 264.. మొత్తం షాపులు 3,736..ఇందులో గీత కార్మికులకు 340
జనసముద్రంన్యూస్, సెప్టెంబర్ 28, అమరావతి.
నూతన మద్యం పాలసీ విడుదలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. నేడో రేపో నోటిఫికేషన్ జారీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,736 షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో 340 షాపులను కల్లు గీత కార్మికులకు కేటాయించింది. మిగిలిన 3,396 షాపులను లాటరీ విధానంలో కేటాయిస్తారు. జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజులకు నాలుగు శ్లాబులను ఎక్సైజ్ శాఖ రూపొందించింది. 10 వేల మంది లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు లైసెన్సు ఫీజుగా చెల్లించాలి. 10 వేలు దాటి 50 వేల మంది వరకు రూ.55 లక్షలు.. 50 వేలు పైబడి 5 లక్షల మంది వరకు ఉన్న చోట్ల రూ.65 లక్షలు.. 5 లక్షల మందికిపైగా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలను ఫీజుగా నిర్ణయించారు. ఈ ఫీజులను ఏడాదిలో ఆరు విడతల్లో చెల్లించే వెసులుబాటు వ్యాపారులకు కల్పిస్తున్నారు. ఏటా 10 శాతం పెంచుతారు. రూ.50 లక్షల శ్లాబు పరిధిలోనే ఎక్కువ షాపులు (1,310) ఉన్నాయి. రూ.55 లక్షల శ్లాబులో 1,032, రూ.65లక్షల పరిధిలో 1,119, రూ.85 లక్షల పరిధిలో 275 దుకాణాలు ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే తిరుపతి జిల్లాలో అత్యధికంగా 264 షాపులున్నాయి. వాటిలో 24 గీత కార్మికులకు కేటాయించారు. తర్వాతి స్థానం పశ్చిమ గోదావరి జిల్లాది (225). అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 37 షాపులు, పార్వతీపురం మన్యంలో 58 షాపులు ఉన్నాయి. మద్యం షాపుల పనివేళలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయి. అలాగే మొత్తం షాపులను ప్రభుత్వం రెండు విధాలుగా వర్గీకరించింది. 3,736లో గీత కులాలకు కేటాయించిన 340 షాపులకు విడిగా నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. మిగిలిన 3,396 షాపులకు శుక్రవారం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల మొదటివారంలోగా ఈ పాలసీని అమల్లోకి తీసుకురావాలని ఎక్సైజ్ శాఖ సంకల్పించింది. అప్పటివరకూ ప్రభు త్వ మద్యం షాపులు కొనసాగుతాయి. ఆ తర్వాత గీత కార్మికులకు కేటాయించిన 340 షాపులకు మరో నోటిఫికేషన్ ఇస్తారు. ఎలైట్ షాపులకు కూడా ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
మూడు సవరణలు
మద్యం పాలసీపై నియమించిన కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫారసుల్లో ప్రభుత్వం మూడు సవరణలు చేసింది. క్వార్టర్ సీసా కనీస ధరను రూ.వందకు సిఫారసు చేయగా దానిని రూ.99కి మార్చింది. ఎలైట్ షాపులను నగరాల్లో ఏర్పాటుచేయాలని సిఫారసు చేయగా తిరుపతిని మినహాయించింది. గీత కార్మికులకు 10 శాతం షాపులను సిఫారసు చేయగా దానిని గీత కులాలుగా మార్చింది.
సెబ్ రద్దుపై ఆర్డినెన్స్ జారీ
గత ప్రభుత్వం కొత్తగా సృష్టించిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్)ను పూర్తిగా రద్దుచేస్తూ గవర్నర్ గురువారం ఆర్డినెన్స్ జారీచేశారు. సెబ్ ఏర్పాటుచేసిన గత ప్రభుత్వం.. కొన్ని అధికారాలను ఎక్సైజ్‌తో పాటు సెబ్‌కు కూడా ఇచ్చింది. ఇటీవల ఎక్సైజ్ శాఖను పునర్‌వ్యవస్థీకరించడంతో ఎక్సైజ్ చట్టంలో సెబ్‌కు అధికారాలు, సెబ్ అనే పేరును తాజా ఆర్డినెన్స్‌లో తొలగించారు. కాగా.. మద్యం షాపులకు సంబంధించి మరో ఆర్డినెన్స్ జారీ కావలసి ఉంది. గతంలో మద్యం వ్యాపారం ప్రభుత్వ లేదా ప్రైవేటు అని చట్టంలో ఉండేది. వైసీపీ ప్రభుత్వం ప్రైవేటును పూర్తిగా తొలగించింది. దీంతో ఇప్పుడు కొత్త పాలసీ ఇవ్వాలంటే చట్టంలో మళ్లీ ప్రైవేటును చేర్చాలి. ఈ ఆర్డినెన్స్ కోసం ఇటీవల రాజ్‌భవన్‌కు పంపిన ఫైలులో కొన్ని పొరపాట్లు ఉండడంతో గురువారం వాటిని సవరించి మళ్లీ పంపారు. ఆ ఆర్డినెన్స్ జారీ కాగానే పాలసీకి నోటిఫికేషన్ ఇస్తారు.