
ఆదిలాబాద్ లో పర్యటించాలని వినతి
సానుకూలంగా స్పందించిన గవర్నర్
ప్రత్యమ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న సర్కార్
ఖానాపూర్ నియోజకవర్గం (జనసముద్రం న్యూస్) సెప్టెంబర్ 25
హైదరాబాద్ లో మంగళవారం రోజున
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క భేటీ అయ్యారు. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటిగా మారుస్తూ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ఆమోదించాలని వినతి పత్రం సమర్పించారు. మంగళవారం నాడు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలసి రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశమయ్యారు.ములుగు మున్సిపాలిటి అంశంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ ఘర్షణ వివరాలను గవర్నర్ కు వివరించారు. ములుగును మున్సిపాలిటీ గా మారుస్తూ 2022 లో గత( బిఆర్ఎస్)ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. అయితే సాంకేతిక సమస్యలతో ఇప్పటి వరకు ములుగు మున్సిపాలిటికి నోచుకోలేదు. జీహెచ్ఎంసీ చట్ట సవరణల బిల్లులోనే ములుగు మున్సిపాలిటి అంశాన్ని చేర్చారు. జీహెచ్ఎంసీలో కోఆప్షన్ సభ్యుల సంఖ్యలను 5 నుంచి 9 కి పెంచుతు, మైనారటి కోఆప్షన్ సభ్యుల సంఖ్యను 2 నుంచి 5 కు పెంచుతూ చట్టసవరణ చేసారు. అదే బిల్లులో ములుగు మున్సిపాలిటి అంశం ఉండటంతో బిల్లుకు అప్పటి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలపలేదు. ఆ తర్వాత రాష్ట్రపతి కార్యాలయానికి బిల్లును పంపారు. దీంతో అప్పటి నుంచి బిల్లు పెండింగ్ లోనే ఉండిపోయింది. దీంతో ఆ బిల్లును ఆమోదించేలా చొరవ చూపాలని మంత్రి సీతక్క గవర్నర్ ను విజ్ఞప్తి చేసారు. దీంతో పాటు ఆదిలాబాద్ లో ఈ మధ్య జరిగిన ఘర్షణ విషయాలనను, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్ధితులను, ఆదివాసులు, మైనారిటీ వర్గాల మద్య సఖ్యత కుదుర్చేలా ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నప్రయత్నాలను గవర్నర్ కు మంత్రి సీతక్క వివరించారు. గిరిజన ప్రాంతాల ప్రత్యేక పాలన అధికారిగా ఆదిలాబాద్ లో పర్యటించాలని గవర్నర్ ను సీతక్క కోరగా..గవర్నర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం మీడియాలో సీతక్క మాట్లాడారు.
ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు పెండింగ్లో వున్న ఇతర బిల్లులకు ఆమోదం తెలుపాలని గవర్నర్ ను కోరినట్లు చెప్పారు. ములుగు మున్సిపాలిటీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉన్నందున….ములుగును మున్సిపాలిటిగా మార్చేందుకు ఏం చేయాలన్న దానిపై సీఎంతో చర్చిస్తామన్నారు. ములుగు లో ఓ గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఉన్నట్లు సీతక్క తెలిపారు. గ్రామాల జాబితాను గవర్నర్ కు పంపించినట్లు వివరించారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు సీతక్క వెల్లడించారు. ఆదివాసులు, గిరిజనుల హక్కులను కాపాడటంతో పాటు, వారి భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రధాన్యతనిస్తుందని సీతక్క మరో సారి స్పష్టం చేసారు.
అయితే ములుగు మున్సిపాలిటి బిల్లు రాష్టపతి వద్ద పెండింగ్ లో ఉండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నయ మార్గలను అన్వేశిస్తుంది. పెండింగ్ బిల్లును రికాల్ చేసి….ములుగును మున్సిపాలిటిగా మారుస్తూ కొత్త బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టేలా కసరత్తులు చేస్తోంది.