
జనసముద్రంన్యూస్:లక్షెటిపేట: సెప్టెంబర్ 25:
మండలంలోని కొత్త కొమ్ముగూడెంకు చెందిన బత్తుల మధుకర్ (25)మృతికి కారణమైన ఆర్ ఏం పీ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసినట్లు మంగళవారం సాయంత్రం సీఐ అల్లం నరేందర్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 18న మధుకర్ కు నీరసంగా ఉండడంతో స్థానిక ఆర్‌ఎంపీ బొడ్డు శ్రీనివాస్ కు తెలుపగా ఇంటికి వచ్చి మధుకర్ కు సెలైన్స్ ఎక్కించాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు తెలిపారు. సెలైన్ లో ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత వణుకు రావడంతో ఆర్ఎంపీ వద్దకు అతని సోదరుడు వెళ్లి చెప్పగా మధుకర్ పరిస్థితి సీరియస్ గా ఉందని అతడు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లమన్నాడన్నారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి అక్కడి వైద్యుడు ఎంఆర్ఐ స్కాన్ చేయించాలని బాధిత కుటుంబ సభ్యులకు తెలపడంతో ఎమ్మారై చేయించగా స్థానికంగా ఎవరితోనైనా వైద్యం చేయించారా? అని డాక్టర్ ప్రశ్నించగా అవును చేయించామని చెప్పడం జరిగిందన్నారు. దీంతో ఆ డాక్టర్ ఆర్ఎంపీ చేసిన వైద్యం వల్లనే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయినట్లు తెలిపారన్నారు. అక్కడి నుంచి కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్‌ను సంప్రదించగా ఇన్‌ఫెక్షన్ సోకిందని,వెంటనే హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించమని చెప్పడంతో అక్కడినుండి హైదరాబాదుకు తరలించడంతో మూడు రోజులు అనంతరం చివరకు మధుకర్ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు వివరించారు.
మండలంలో ఇటీవల ఆర్ ఏం పీ ల వైద్యం వలన జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆర్ ఏం పీ లకు త్వరలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని సీఐ పేర్కొన్నారు. ఆర్ ఏం పీ లు ప్రథమ చికిత్సను దాటి వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని సీ ఐ హెచ్చరించారు.