— సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మారం రెడ్డి.
జనసముద్రంన్యూస్:లక్షేట్టిపేట:సెప్టెంబర్ 20: ప్రజలకు చట్టాల పై అవగాహన కల్పించడంలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమని సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మారం రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవన్ ఆవరణలో అంగన్వాడీలకు ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు లో ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అర్పిత మారం మాట్లాడుతూ…..సమాజంలో అనేక రకాల సమస్యలు వాటి ఇబ్బందుల నిర్మూలనకు చట్టాలపై అవగాహన ఎంతో అవసరమన్నారు. ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు అన్ని కుటుంబాలతో ఉండే సత్సంబంధాల వలన ప్రజలకు చట్టాల గురించి నేరుగా అవగాహన కల్పించే అవకాశం లభిస్తుందన్నారు. ప్రతి ఆడబిడ్డ ఒక తల్లిగా, చెల్లిగా, కూతురుగా పోషిస్తున్న పాత్రలు అదేవిధంగా మగవారు కుటుంబాల కోసం చేస్తున్న త్యాగాలను అవగాహన చేసుకుంటే గొడవలే జరుగవని వివరించారు. ముఖ్యంగా సమాజంలో విడాకుల కేసులు ఎక్కువ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తమ పౌరులుగా రాణించాలంటే చట్టాలతో పాటు స్వీయ నియంత్రణతో కూడిన ప్రవర్తన ఎంతో అవసరమన్నారు. మహిళల కేసుల విషయాల్లో పలువురు అంగన్వాడీల అనుమానాలను న్యాయమూర్తి నివృత్తి చేశారు. మానవత్వంతో చట్టాలకు లోబడి నడుచుకుంటే కేసుల పేరుతో ఇబ్బందులు పడాల్సిన పని ఉండదని వివరించారు. అదే విధంగా సమాజంలో పాత్రికేయులు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు మరింత ప్రభావితంగా చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తాము చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తే సమస్యలు దాదాపుగా దరిచేరవని, బాధ్యతలు విస్మరించినప్పుడే అనర్ధాలు జరుగుతాయన్నారు. తప్పు చేసి బాధపడే కంటే ముందస్తు ప్రణాళికతో జీవితంలో సక్రమంగా నడుచుకుంటే సమస్యలుండవని తెలిపారు. ప్రతి అంగన్వాడీ కార్యకర్త ఇంటింటికి చట్టాల గురించి సమాచారాన్ని చేరవేయాలని కోరారు. అంతకుముందు మంచిర్యాల ఏ జీ పీ సత్య శ్రీలత, న్యాయవాదులు పద్మ, అక్కల శ్రీధర్, లక్షేట్టిపేట ఏ జీ పీ సత్యం, రవీందర్ లు అంగన్వాడీలకు చెక్ బౌన్స్, గృహహింస,వరకట్నం,ఫోక్సో, గంజాయి, భూ హక్కులు, ఆస్తి హక్కులు, పలు ఒప్పందాలకు సంబంధించిన చట్టాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో న్యాయమూర్తిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నేరెళ్ల పద్మ, అక్కల శ్రీధర్, ఏ జీ పీ సత్యం, రవీందర్, ఎస్సై పనస రాజయ్య,జూనియర్ అసిస్టెంట్ నీరజ, సుమారు 50 మంది అంగన్వాడీ లు పాల్గొన్నారు.