జనసముద్రం న్యూస్ ప్రతినిధి ఏప్రిల్: 18
రోడ్ల మీద వాహనాల్ని నడిపే వేళలో అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలో చేసే తప్పులకు కొన్నిసార్లు ప్రాణాలు పోగొట్టుకునే దుస్థితి. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన ఒక నేత.. తన ప్రాణాల్ని ఇదే రీతిలో కోల్పోయారు. ప్రముఖ సినీనటుడు రఘుబాబు ప్రయాణిస్తున్న కారు.. గులాబీ నేతను ఢీ కొనటం.. ఈ ఉదంతంలో సదరు నేత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సంచలనంగా మారిన ఈ ఉదంతంలో తప్పంతా కూడా ప్రాణాలు కోల్పోయిన బీఆర్ఎస్ నేత జనార్దన్ రావుదేనని స్థానికులు చెబుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని నార్కట్ పల్లి – అద్దంకి రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ పట్టణానికి చెందిన 48 ఏళ్ల జనార్దన్ రావు.. తన ఫాంహౌస్ లో వాకింగ్ కోసం టూ వీలర్ మీద వెళుతున్నారు.
అయితే.. ఫాం హౌస్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో హైదరాబాద్ నుంచి గుంటూరుకు కారును సొంతంగా నడుపుతూ వెళుతున్న రఘుబాబు.. వెనుక నుంచి టూ వీలర్ ను బలంగా ఢీ కొన్నారు. అయితే.. జనార్దన్ రావు రాంగ్ రూట్ లో రావటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ ప్రమాదం అనంతరం తీవ్రమైన ఒత్తిడితో ఉన్న రఘుబాబును.. అక్కడి స్థానికులు పలువురు.. ‘‘మీ తప్పేం లేదు. బండిని ఆయన రాంగ్ రూట్ లో తీసుకొచ్చారు’’ అన్న వీడియోలు కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయి.
రఘుబాబు కారు.. జనార్థన్ రావు వాహనాన్ని బలంగా ఢీ కొనటంతో.. బ్యాలెన్సు తప్పిన ఆయన.. ఎగిరి డివైడర్ మీద పడ్డారు. తల.. ఛాతి భాగంలో బలమైన గాయాలు కావటంతో ఘటనాస్థలంలోనే మరణించారు. జనార్దన్ రావుకు కుమార్తె.. కుమారుడు ఉన్నారు. పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ తో రఘుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే.. వ్యక్తిగత పూచీకత్తు మీద షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.