జనసముద్రం న్యూస్,మార్చి29:
సరదాకు ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీరి ప్రాణాలు కోల్పోయిన ఒక షాకింగ్ ఉదంతం బెంగళూరులో చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య సాగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఒకరిని బలి తీసుకుంది. వాహనాలకు వాష్ చేసిన తర్వాత నీళ్లను తుడిచేందుకు ఉపయోగించే ఎయిర్ బ్లోయర్ నాజిల్ ను స్నేహితుడి మర్మాంగంలోకి జొప్పించిన ఉదంతం ప్రాణం పోయేలా చేసింది. అసలేం జరిగిందంటే..
బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల యోగేశ్.. పాతికేళ్ల మురళీ ఇద్దరు స్నేహితులు. మురళీ స్థానిక వాషింగ్ సెంటర్ లో పని చేస్తుంటాడు. ఇటీవల తన బైక్ నను వాష్ చేయించేందుకు మురళీ వద్దకువెళ్లాడు. తన బైక్ కు వాటర్ సర్వీసింగ్ చేయాలని కోరిన నేపథ్యంలో.. మురళీ ఆ పని చేశాడు. ఈ క్రమంలో వారిద్దరు అక్కడున్న ఎయిర్ బ్లోయర్ తో సరదాగా ఆడుకున్నారు.
ఇందులో భాగంగా ఎయిర్ బ్లోయర్ తో యోగేశ్ ముఖం మీద మురళీ కొట్టగా.. అతను తప్పించుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య సరదా తోపులాట సాగింది. ఈక్రమంలో మిత్రుడ్ని బలంగా పట్టుకున్న మురళీ.. బ్లోయర్ నాజిల్ ను యోగేశ్ మర్మాంగంలోకి జొప్పించి.. దాన్ని ఆన్ చేశాడు. తీవ్రమైన ప్రెషర్ తో అతడి పొట్ట ఉబ్బిపోయి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో వెంటనే మిత్రుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. యోగేశ్ ను పరీక్షించిన వైద్యులు.. అతడి అంతర్గత ఆవయువాలు దెబ్బ తిన్నట్లుగా గుర్తించారు. అయినప్పటికీ అతడికి చికిత్స చేస్తున్న క్రమంలోనే యోగేశ్ ప్రాణాలు పోయాయి. ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడి ప్రాణాలు తీసిన మురళీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరదాకు హద్దు ఉంటుందని.. దాన్ని అధిగమిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న దానికి ఈ ఉదంతం ఒక పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు.