
జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా టౌన్ రిపోర్టర్ మార్చి 28
ఏలూరు, మార్చి , 28 : జిల్లాలో గర్భస్థ లింగ పిండ నిర్దారణ నియంత్రణ చట్టంను పటిష్టంగా అమలు చేసేందుకు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేటులోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం గర్భస్థ లింగ పిండ నిర్దారణ నియంత్రణ చట్టం అమలు జిల్లా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ గర్భస్థ లింగ పిండ నిర్దారణ నియంత్రణ చట్టంను అమలు చేయని స్కానింగ్ సెంటర్ లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. స్కానింగ్ లో మగ బిడ్డా, ఆడ బిడ్డా అని తెలుసుకుని, ఆడ బిడ్డ అయితె అబార్షన్లు చేయించుకుంటున్నారన్నారు. దీని కారణంగా సమాజంలో ఆడపిల్ల సంఖ్య తగ్గిపోతుందన్నారు. సమాజంలో మగ ,ఆడ బిడ్డల నిష్పత్తి లో చాలా వ్యత్యాసం ఉంటుందన్నదని, ఇది చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. గర్భస్థ లింగ పిండ నిర్దారణ నియంత్రణ చట్టంను మరింత పటిష్టవంతంగా అమలు చేసేందుకు జిల్లాలోని ప్రతీ స్కానింగ్ సెంటర్ లపై నిఘా కెమెరాలతో 'డెకాయ్ ' ఆపరేషన్ లు నిర్వహించాలని, నిఘాలో నిబంధనలు పాటించకుండా చట్టాన్ని అతిక్రమించిన స్కానింగ్ కేంద్రాలను సీజ్ చేసి, సంబంధిత స్కానింగ్ కేంద్రాల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాలో గత మూడు నెలల్లో వివిధ ఆసుపత్రులలో 136 అబార్షన్లు జరిగాయని, ప్రతీ కేసుపై సవివరమైన ఆడిటింగ్ చేయాలన్నారు. వీటిలో సహేతుకమైన కారణాలు లేకుండా జరిగిన అబార్షన్ లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, ప్రతీ కేసును క్షుణ్ణంగా పరిశీలించాలని, చట్టాన్ని అతిక్రమించి అబార్షన్లు చేసిన ఆసుపత్రులపై కేసులు నమోదు చేయాలన్నారు. స్కానింగ్ సెంటర్ లలో ఆసుపత్రుల నిర్వహిస్తూ, అబార్షన్లు చేసిన ఆసుపత్రులపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. గర్భస్థ లింగ పిండ నిర్దారణ నియంత్రణ చట్టంపై విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు పాఠశాల స్థాయిలో వ్యాసరచన, వ్రక్తుత్వ పోటీలు నిర్వహించాలని , పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందించాలన్నారు. స్కానింగ్ కేంద్రాల ఏర్పాటుకు కొత్తగా అందిన దరఖాస్తులను పరిశీలించి, నిబంధనల మేరకు ఉన్నవాటికి అనుమతులు మంజూరు చేయాలన్నారు.
సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ స్వరూపరాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శర్మిష్ట, జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డా. పాల్ సతీష్, జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డా. నాగేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ మేరీ కేథరిన్, ఐ సి డి ఎస్ పీడీ పద్మావతి, జిల్లా బాలల సంరక్షణాధికారి సూర్యచక్రవేణి, కమిటీ మెంబర్లు కె.బి. సీతారాం, ప్రభృతులు పాల్గొన్నారు.





