జనసముద్రం న్యూస్, జూన్ 20:
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా లో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ కాలు నాదే.. ఆ కాలూ నాదే.. నా కాలు మీద కాలేసుకుంటే ప్రాబ్లం ఏంటీ అంటూ బన్నీ ఓ వ్యక్తిని ప్రశ్నిస్తాడు. ఆ సినిమా విషయం పక్కన పెడితే మీరు ఈ కాలు నాదే.. ఈ కాలు నాదే అని కాలు మీద కాలేసుకున్నారనుకో… మీరు ప్రమాదంలో పడినట్లే అని వైద్య నిపుణులు అంటున్నారు.
అసలు విషయం ఏమిటంటే.. మీరు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారా? కుడివైపు లేదా ఎడమవైపు కాళ్లు క్రాస్ చేసి కూర్చున్న వారిలో మీరు ఒకరా? అయితే జాగ్రత్త. 62 శాతం మంది కాళ్ల ను కుడివైపు క్రాస్ చేసి కూర్చొంటున్నారని తేలింది. ఇక 26 శాతం ప్రజలు ఎడమవైపు క్రాస్ చేస్తుంటారని… 12 శాతం మంది ఎటు వీలైతే అటు క్రాస్ చేస్తుంటారని ఓ అధ్యయనంలో తేలింది.ఇలా కాళ్ల ను క్రాస్ చేసి కూర్చోవడం వల్ల ప్రమాదమని అంటున్నారు వైద్యులు. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల హిప్స్ అమరిక లో తేడాలొస్తాయని చెబుతున్నారు. ఒకదాని తో పోలిస్తే మరొకటి పెద్దగా అవుతుందట. కాలు మోకాలు పాదం వంటి శరీరం లోని కింద భాగాల కు రక్తనాళాల ద్వారా జరిగే రక్త సరఫరా వేగంలో మార్పులు వస్తాయని చెబుతున్నారు. ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.
మోకాలి పై మోకాలు వేసుకుని కూర్చోవడం అత్యంత ప్రమాదకరమని.. ఇలా కూర్చోవడం వల్ల సిరలలో రక్త ప్రసరణ వేగం తగ్గి రక్తపోటు అధికమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా ఎక్కువ కాలం కూర్చుంటే… ముందుకు వంగిపోయే గుణం భుజాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని ఒక అధ్యయనంలో తేలిందట.మెడ ఎముకల్లో మార్పులు రావడంతో తల భాగం అమరికలో కూడా మార్పులు వస్తుంటాయని చెబుతున్నారు. ఇక మగవారి లో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వీర్య కణాల ఉత్పత్తి పై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఒకవేళ మీరూ కాలు మీద కాలేసుకుని కూర్చునే అలవాటు ఉంటే మానుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు వైద్యులు.