జనసముద్రం న్యూస్, ఫిబ్రవరి 11
పోడు పట్టాలపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈనెల చివరి నుంచి పోడు పట్టాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా చెబుతున్నందున ఈసారి కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. అయితే పోడు పట్టాలపై కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారు. నాగార్జున సాగార్ బై పోల్ సందర్భంగా పోడు పట్టాల పంపిణీ ఇక్కడి నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆదివాసీలకు పట్టాలు అందలేదు. ఇప్పుడు ఈనెల చివరి వారం నుంచి అని హామీ ఇచ్చారు. అయితే అడవుల్లో చాలా మంది భూ ఆక్రమణ దారులు ఉన్నారని వారిని కాదని నిజమైన లబ్ధిదారులకు అందేలా కసరత్తు చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈసారైనా పట్టాల పంపిణీ ఉంటుందా? లేక మెలిక పెట్టి వాయిదా వేస్తారా? అని చర్చించుకుంటున్నారు.
2021 అక్టోబర్ 9న అటవీ గిరిజన శాఖ అధికారుల సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోడు పట్టాల పంపిణీపై సమీక్షించారు. అక్టోబర్ 3వ వారం నుంచే కార్యాచరణ మొదలు పెట్టాలని ఆదేశించారు. దీంతో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు. అయితే అంతకుముందే 2017 నాటికే పోడు పట్టాల కోసం 1.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత మరి కొంత మంది పట్టాల కోసం అప్లై చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు కొన్ని చోట్లు అటవీ ఆక్రమణ జరిగిందని గుర్తించారు.రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ వెలువరించిన గణాంకాల ప్రకారం 26.90 లక్షల హెక్టార్లలో 2.94 లక్షల హెక్టార్లు ఆక్రమణ జరిగినట్లు గుర్తించారు. 2018 తరువాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు కేవలం 4248 ఎకరాలు మాత్రమే పంపిణీకి అర్హత ఉందని పేర్కొన్నారు. ఈ నివేదికపై 2021లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా చూసుకుంటామన్నారు. అదే సమయంలో అడవితల్లే జీవనాధారంగా బతుకుతున్న ఆదివాసీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీలు కాకుండా బయటి నుంచి వచ్చే వ్యక్తులు అటవీ ఆక్రమణ చేస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
అయితే ఆదివాసీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ మూడో వారం నుంచి మొదలు పెట్టాలని అందులో పేర్కొన్న అంశాల ఆధారంగా భూముల వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దారించేలా చర్యలు తీసుకోవాలని అప్పటి ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. నవంబర్ నెల నుంచి అటవీ భూముల సర్వే మొదలు పెట్టాలని సూచించారు. అయితే ఆ తరువాత పలు సమావేశాలు నిర్వహించినా పట్టాల పంపిణీ కాలేదు.తాజాగా అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ పట్టాల పంపిణీ ఉంటుందని చెప్పారు. అయితే ఈసారి కూడా ఉంటుందా? లేక అటవీ భూ ఆక్రమణ పేరిటి మెలిక పెట్టి వాయిదా వేస్తారా? అని చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల తరువాత ఎన్నికల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పట్టాల పంపిణీ ప్రారంభమైనా కోర్టుకేసులు ఇతర కారణాలతో మరోసారి అడ్డు పుల్ల పడే అవకాశం లేకపోలేదని చర్చించుకుంటున్నారు. అలా కాదని ఆదివాసీల చేతికి పట్టాలు వస్తే మరింత సంతోషమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎన్నికల ప్రయోజనానికే ఈ ప్రకటన చేసి ఉంటారా? అని రాజకీయంగా చర్చ సాగుతోంది.