★ఖమ్మం లో నిర్వహించిన సభకు నిధుల సమీకరణ పై విచారణ జరిపించాలి.
★నిజమైన దళితులకి దళిత బంధు ద్వారా న్యాయం జరిగే వరకూ పోరాటం.
★రాబోయే ఎన్నికల్లో రేవంతన్న నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తథ్యం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, ఏడుళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పిట్టలదొర, తుపాకి రాముడు వేషాలతో కూడిన నాయకుడి పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు తనకు రాజకీయ బిక్షను ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పేరున గెలిచిన చంద్రశేఖర రావు ఇప్పుడు ఖమ్మం బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ వేడుకలు అంటూ తుపాకి రాముడులా రోజుకో తీరు మాట్లాడుతున్నారని,ఇచ్చిన వాగ్దానాలను మరిచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 559 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి పది లక్షల రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించటం అంటే తన అధికార దాహానికి నిదర్శనమని పేర్కొన్నారు. 2018లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, చిత్తశుద్ధి కల నాయకుడైతే పినపాక మండలంలో ఎంతమంది నిజమైన దళితులకు దళిత బంధు ప్రకటించారు తక్షణమే తెలపాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకం అంటే బిఆర్ఎస్ కార్యకర్తల కోసమనే భావనను నియోజకవర్గ ప్రజల్లో తీసుకువచ్చిన ఘనత రేగ కాంతారావుకి దక్కుతుందని విమర్శించారు. రైతుబంధువలన ఎంపీలు, ఎమ్మెల్యేలకు మాత్రమే ఉపయోగపడిందని కెసిఆర్ అమలుపరిచిన రైతు బంధు పథకం వలన ఏ ఒక్క సన్న, చిన్న కారు రైతులకు ఉపయోగం లేదని, రైతులకు మేలు జరగాలంటే పండించిన పంటకు ఇట్టుబాటు ధర ప్రకటించాలని, ధర వలనే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలే ఓటుతో బుద్ధి చెప్తారని, ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి, ఈ సభలకు అధిక సంఖ్యలో జన సమీకరణకు ఒక్కొక్క మనిషికి సుమారు 300 నుంచి 500 రూపాయలు ఇచ్చి జన సమీకరణ చేసినంత మాత్రాన సభలు విజయవంతం అయ్యాయని ప్రకటించుకోవటం సిగ్గుచేటు అన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ మాయ మాటలు ఎవరు నమ్మరని వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వరంగల్ డిక్లరేషన్ లో ప్రకటించినటువంటి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కొంబత్తిని శ్రీను, బసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.