జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 13:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ను 6 నుండి 10 శాతం పెంచగా కొన్ని వర్గాలు అడ్డుకొని,తగ్గించే కుట్ర చేస్తున్నారని ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వజ్రగిరి అంజయ్య, బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరథ నాయక్, బంజారా సంఘం జిల్లా నాయకులు, నీటి సంఘం మాజీ చైర్మన్ దానావత్ జానియా నాయక్, BMP రాష్ట్ర నాయకులు దానవత్ నీలకంఠం నాయక్ లు తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ ఎన్నో పోరాట ఫలితంగా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ సాధిస్తే, కొన్ని వర్గాలు కావాలని కుట్ర పన్ని రిజర్వేషన్ తగ్గించాలని కోర్టులో పిటిషన్ వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 1986లో 4 నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ ను ఆనాటి 1981 జనాభా ప్రకారం పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం 2021 జనాభా ప్రకారం గిరిజనులోని 34 కులాల జనాభా ఆధారంగా రిజర్వేషన్ ను 10 శాతం పెంచారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. గిరిజన వర్గాలలో” అశాంతిని, అలజడిని” సృష్టించేందుకు కొందరు కావాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్ పెంపు పై వేసిన కేసును ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. రిజర్వేషన్ పెంపు వల్ల కొన్ని వర్గాలకే మేలు జరుగుతుందనేది అపోహ మాత్రమేనని అన్నారు, ఆదివాసి ప్రాంతాలలో 100 శాతం ఉద్యోగ,ఉపాధి అవకాశాలు వాళ్ళకే కల్పించబడుతుందని, విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇప్పటికైనా గిరిజనులలోని అన్ని కులాలు ఐక్యంగా ఉండి పెరిగిన రిజర్వేషన్ ను అమలు జరిగేలా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో బంజారా సంఘం నాయకులు, శంకర్ నాయక్,లింగ నాయక్, బంజారా సంఘం ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





