జనసముద్రం న్యూస్,జనవరి 12:
య్యప్ప స్వామి దీక్షను పూని నిష్ఠగా శబరిమలకు వెళ్లే లక్షలాది మంది స్వాములు మాత్రమే కాదు.. దీక్ష తీసుకోకుండానే స్వామివారిని దర్శించుకునే వారంతా తప్పనిసరిగా తమతో తెచ్చుకునే ప్రసాదం ఏమైనా ఉందంటే.. అది స్వామివారి ప్రసాదంగా చెప్పే ‘అరవణ ప్రసాదం’గా చెప్పాలి. శబరిమల నుంచి ఎంతో పవిత్రంగా తీసుకొచ్చే ఈ ప్రసాదాన్ని ఇంటికి వచ్చిన తర్వాత తమకు తెలిసిన వారందరికి పంచే అలవాటు తెలిసిందే.
అలాంటి ప్రసాదం అమ్మకాల్ని వెంటనే ఆపేయాలని కేరళ హైకోర్టు తాజాగా ట్రావెన్ కోర్ దేవస్వమ్ బోర్డుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. శబరిమలలో అరవణ ప్రసాదం అమ్మకాలు నిలిచిపోయాయి. ఎందుకిలా జరిగింది? అసలేమైంది? అన్నది ప్రశ్నకు కోర్టును ఆశ్రయించిన పిటిషన్ దారులు సమాధానం చెప్పేస్తున్నారు. అరవణ ప్రసాదంలో వినియోగించే యాలకుల్లో పరిమితికి మించి రసాయనాలు వినియోగించారన్న నివేదికతో హైకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
అయితే.. యాలకుల్ని వినియోగించకుండా ప్రసాదాన్ని తయారు చేయొచ్చన్న సూచనను చేసింది. అరవణ ప్రసాదంలో వినియోగించే యాలకుల్నిగతంలో ‘అయ్యప్ప స్పైసెస్’ అనే సంస్థ నుంచి ట్రావెన్ కోర్ బోర్డు కొనుగోలు చేసేది. అందుకు భిన్నంగా ఇటీవల మరో కాంట్రాక్టర్ కు యాలకుల్ని సప్లై చేసే బాధ్యతల్ని అప్పజెప్పింది. ఈ నేపథ్యంలో యాలకుల నాణ్యతపై అయ్యప్ప స్పైసెస్ సంస్థ కంప్లైంట్ చేయటంతో అధికారులు ల్యాబ్ లో నాణ్యత పరీక్షల్ని నిర్వహించారు.
అందులో మోతాదుకు మించిన రసాయనాలు వాడినట్లుగా తేలింది. ఇటీవల సరఫరా చేసిన యాలకుల్లో 14 రకాల రసాయనాలు మోతాదుకు మించి ఉన్నట్లుగా నివేదిక వచ్చింది. దీని ఆధారంగా చేసుకొని హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో.. ఇప్పటివరకరు తయారు చేసిన అరవణ ప్రసాదం అమ్మకాల్ని నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేస్తూ.. యాలకులు లేకుండా ప్రసాదాన్ని తయారు చేయొచ్చని సూచన చేసింది. దీంతో.. యాలకుల్ని మినహాయించి అరవణ ప్రసాదాన్ని తయారు చేసినంతనే అమ్మకాల్ని చేపడతారు.
ఈ నేపథ్యంలో.. ఇటీవల కాలంలో అయ్యప్ప ప్రసాదాన్ని తీసుకొచ్చి.. ఇంట్లో ఉంచుకున్న వారు కానీ.. బంధువుల నుంచి ప్రసాద డబ్బాల్ని తమతో నిల్వ ఉంచుకున్నవారు కానీ వాటిని వాడకపోవటమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.