

జనసముద్రం న్యూస్, జనవరి 10:
గుర్తింపు కోరుకోని జీవులు ఎవరుండరు? ఏ జాతి ఉండదు? కానీ.. కలలో కూడా ఊహించని.. కంట కన్నీరు పెట్టించేలా.. కడుపు తెవిలేలాంటి గుర్తింపు కంటే బాధాకరమైన అంశం ఇంకేం ఉంటుంది. తాజాగా కేంద్రం రూపొందించిన ఒక నివేదికలో దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ముందుగా.. ఆ మాటకు వస్తే జాబితాలోనే తొలి స్థానాన్ని సొంతం చేసుకున్న అంశం గురించి విన్నంతనే ఆంధ్రోడి గుండె మండిపోయేలా మారింది. బతికేందుకు ఏ చిన్న అవకాశం లభించినా వదలక ప్రయత్నించే వారు.. తమకు మరే అవకాశం లభించని పరిస్థితుల్లో మాత్రమే ఆశ్రయించే వ్యభిచారానికి ఏపీ మొదటి స్థానంలో నిలవటానికి మించిన అవమానకరమైన విషయం ఏం ఉంటుంది?
దేశంలో మహిళా సెక్సు కార్మికులు ఎక్కువగా ఉన్నది ఏపీలోనే అన్న విషాదకరమైన అంశాన్ని కేంద్రం విడుదల చేసిన తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. వ్యభిచారంలోకి వచ్చే వారి సంఖ్య ఏడాదికేడాదికి పెరుగుతుందన్న విషయం తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ పెరుగుదల రేటు ఎంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏడాదికి పది నుంచి పదిహేను శాతం వరకు వ్యభిచారంలోకి వచ్చే వారు ఏపీలో ఉన్నారని.. ఇలా వచ్చే వారి వయసు సరాసరి 18- 40 ఏళ్ల మధ్య ఉందని పేర్కొంది.
బతికేందుకు.. చేసేందుకు పని లేకపోవటం.. ఉపాధి అవకాశాలు తగ్గిపోవటం.. కుటుంబ ఆర్తిక పరిస్థితులు.. బాధ్యతలు.. విలాస జీవితాలకు అలవాటు పడిపోవటం లాంటి కారణాలతోనే ఇలాంటివి జరుగుతున్నట్లుగా కేంద్రం తన నివేదికలో స్పష్టం చేస్తోంది. వివిధ సంస్థలు చేపట్టిన సమాచారాన్ని క్రోడికరించగా వచ్చిన సమాచారంతో ఈ రిపోర్టును సిద్ధం చేశారు. దీని ప్రకారం చూసినప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యభిచారం వైపు మళ్లే వారు ఎక్కువగా ఉంటారని పేర్కొంది.
తర్వాతి స్థానంలో కర్నూలు.. చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా ఉంటారని వెల్లడించింది. ఈ జిల్లాల నుంచి బెంగళూరు.. హైదరాబాద్.. చెన్నై వెళ్లే జాతీయ రహదారులు ఉండటం కూడా ఈ వ్యభిచారంలోకి వెళ్లేందుకు కారణాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఇక.. అతి తక్కువ వ్యభిచారంలో ఉన్న రాష్ట్రాల్లో మిజోరం నిలిచింది. ఇదిలా ఉంటే.. ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వేశ్యలుగా జీవిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నారు.
ఏపీకి వస్తున్న ఇతర రాష్ట్రాల వారిని చూస్తే.. ఒడిశా.. ఛత్తీస్ గఢ్.. అసోం.. బిహార్.. అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి ఇతర రంగాల్లో పని చేస్తున్న పలువురు వేశ్యా జీవితంలోకి అడుగు పెడుతున్నట్లుగా పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వలస వెళ్లి వేశ్యులుగా పని చేస్తున్న వారి విషయంలో మహారాష్ట్ర సరికొత్త రికార్డుల్లోకి వెళుతోంది. ఈ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి వెళుతున్న వారు ఏకంగా 6.06 లక్షలుగా నిలవగా.. తర్వాతి స్థానాల్లో గుజరాత్ 2.08 లక్షలు.. ఢిల్లీలో 1.85 లక్షల చొప్పున జీవిస్తున్నారు.
స్వలింగ సంపర్కులు దేశంలో ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఇందులో గుంటూరు.. క్రిష్ణా.. తూర్పుగోదావరి జిల్లాల్లోనే ఎక్కువమంది ఉన్నట్లుగా పేర్కొన్నారు. హిజ్రాలు దేశంలోఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ.. మహారాష్ట్ర.. తమిళనాడు రాష్ట్రాలు మొదటి మూడుస్థానాల్లో నిలవగా.. ఈ విషయంలో ఏపీ ఐదో స్థానంలో నిలిచింది. అంతేకాదు.. దేశంలో హెచ్ ఐవీ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో నిలవటం గమనార్హం. ఇందులో మహారాష్ట్ర ముందు ఉంటే.. తర్వాతి స్థానంలో కర్ణాటక నిలిచినట్లుగానివేదికలో పేర్కొన్నారు.