జనసముద్రం న్యూస్,జనవరి 08:

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాలపైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పిఠాపురం (కాకినాడ జిల్లా) తిరుపతి (తిరుపతి జిల్లా) భీమవరం (పశ్చిమ గోదావరి జిల్లా) కాకినాడ రూరల్ (కాకినాడ జిల్లా) ఇలా పలు నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం అర్బన్ నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తే ఆయనను గెలిపిస్తానన్నారు. 2014లో ఆయన తమ గెలుపుకు పాటు పడ్డారని.. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన అనంతపురం నుంచి పోటీ చేస్తే ఎమ్మెల్యేగా గెలిపిస్తానని హాట్ కామెంట్స్ చేశారు.ప్రభాకర్ చౌదరి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేసే వీలుంది. లేదా ఈ స్థానాన్ని టీడీపీ–జనసేన పొత్తు కుదిరితే జనసేనకు కేటాయించే అవకాశం ఉంది.
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కాపు (బలిజ) ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఈ నియోజకవర్గంలో దాదాపు 40 వేల వరకు కాపు ఓటర్లు ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యలకు ముందే అనంతపురం అర్బన్ నుంచి కూడా పవన్ కల్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి.2009లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి అనంతపురం అర్బన్ లో 30 వేల వరకు ఓట్లు రావడం గమనార్హం. 2019లో ఇక్కడ జనసేన అభ్యర్థి టీసీ వరుణ్ పోటీ చేశారు. ఆయన కు 11 వేల ఓట్లు వచ్చాయి.
ఈ నేపథ్యంలో అనంతపురం అర్బన్ లో ఈసారి సైతం జనసేన పార్టీ పోటీ చేసే వీలుందని అంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడ నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తే ఆయన గెలుపుకు తాను కృషి చేస్తానని తెలిపారు. జగన్ను ఇంటికి పంపడమే టీడీపీ జనసేన లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి తనకు ప్రత్యేక వ్యూహం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారని ప్రభాకర్ చౌదరి గుర్తు చేశారు.






