జనసముద్రం న్యూస్, జనవరి 01:
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూస్తున్నారు. అందుకోసం ఆయన కఠినంగా వ్యవహరించబోతున్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాలనుకుంటున్నారు. తన వారు పరవారు అన్న భేదం లేకుండా చూడాలనుకుంటున్నాను. అలా ఒక నలభైమందికి ఎమ్మెల్యే టికెట్లు వచ్చే ఎన్నికల్లో దక్కవు అని వైసీపీలో విపరీతమైన ప్రచారం సాగుతోంది. వారిలో నెల్లూరు పెద్దారెడ్డి లాంటి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా ఉన్నారని అంటున్నారు.ఇప్పటికి రెండు విడతలుగా జగన్ ఎమ్మెల్యేలతో పార్టీ తరఫున వర్క్ షాప్స్ ని నిర్వహించారు. అలాగే పార్టీకి చెందిన జిల్లా ప్రెసిడెంట్లతో రీజనల్ కో ఆర్డినేటర్లతో మీటింగులు పెట్టారు. ఈ సందర్భంగా గత ఏడాది ఏప్రిల్ నుంచి వైసీపీ అధినాయకత్వం ఆదేశించిన మేరకు గడప గడపకు వైసీపీ ప్రభుత్వం అన్న కార్యక్రమాన్ని చాలా మంది ఎమ్మెల్యేలు సరిగ్గా పట్టించుకోలేదు అన్నది కూడా జగన్ చెప్పారని అంటున్నారు.పనితీరు మార్చుకోని ఎమ్మెల్యేల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తామని కూడా హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి. అలా ఒక నలభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల జాబితాను కూడా వైసీపీ రెడీ చేసింది అని అంటున్నారు. ఆ జాబితాలో ఆనం రామనారాయణరెడ్డి ఒకరని అంటున్నారు. ఈ మేరకు వర్క్ షాప్ కి అటెండ్ అయిన ఆనం కి ఆ విషయం అర్ధం అయింది అనే అంటున్నారు. నిజానికి సీనియర్ మోస్ట్ గా ఉన్న ఆనం వారు జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవిని ఆశించారు.
అయితే ఆయనకు తొలిసారే కాదు మలి దఫా విస్తరణలో కూడా దెబ్బేశారు. ఆయన మంత్రి ఆశలకు జగన్ నిలువునా గండికొట్టారు. ఇంకో వైపు చూస్తే ఆనం వ్యవహారశైలి పట్ల కూడా హై కమాండ్ గుర్రుగా ఉంది అంటున్నారు. ఆయన ఓపెన్ గా ఉండడం తనకు తోచినట్లుగా మాట్లాడుతూ అధినాయకత్వాన్ని ఇరుకున పెట్టడం వంటి వాటి వల్లనే ఆయన్ని దూరం పెట్టారని అంటున్నారు. ఆయన తరచూ ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడాన్ని కూడా సీరియస్ గా చూస్తున్నారు అని అంటున్నారు.
దాంతో ఇవన్నీ కనుక బేరీజు వేసుకుంటే కచ్చితంగా ఆయనకు టికెట్ దక్కదు అనే అంటున్నారు. పైగా అక్కడ జగన్ కి ఇష్టుడైన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఉన్నారు. దాంతో ఇవన్నీ ముందే అంచనా కట్టిన ఆనం ఇపుడు పెద్ద నోరు చేస్తున్నారు అని అంటున్నారు. ఎటూ వైసీపీలో ఉండేది ఒక ఏడాదిన్నర ఎమ్మెల్యే కాబట్టి ఆయన డేరింగ్ గా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు. 2024 ఎన్నికల నాటికి ఆనం టీడీపీ గూటికి చేరుకుంటారని కూడా చెబుతున్నారు.
ఆనం ఇప్పటికే ఆ దిశగా తన ప్రయత్నాలు మొదలెట్టారని ఆయనకు అక్కడ కచ్చితమైన భరోసా లభించడబట్టే ఈ గట్టునే ఉండి మరీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా ఆనం రామనారాయణరెడ్డి ఈడవారు కాదు టీడీపీ వారే అని వైసీపీ నిర్ధారణకు వచ్చింది. ఆయన కూడా వచ్చేశారు. సో ఆనం మరిన్ని బాంబులను ఫ్యాన్ పార్టీ నీడలోనే ఉంటూ పేల్చి అపుడు తాపీగా సైకిలెక్కేస్తారు అని అంటున్నారు.