జనసముద్రం న్యూస్, డిసెంబర్ 24:
ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు అన్నట్లుగానే ఏపీలో బీజేపీ జనసేన పార్టీల మధ్య ఉమ్మడి మీటింగ్ జరగనుంది. ఇది నిజంగా ఏపీ రాజకీయాలను బట్టి చూస్తే కీలకమైన పరిణామంగా చెప్పుకోవాలి. ఏపీలో బీజేపీ జనసేన పొత్తులలో ఉన్నాయి. ఆ సంగతి రాజకీయ జీవులకు తప్ప ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. పవన్ బీజేపీతో 2020 జనవరిలో పెట్టుకున్నారు.
అది జరిగిన తరువాత రెండు పార్టీల మధ్య ఒక మీటింగ్ జరిగింది. దానికి పవన్ అటెండ్ అయ్యారు. ఆ తరువాత 2021లో మరో మీటింగ్ జరిగితే జనసేన నేత నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఆ తరువాత సుదీర్ఘమైన గ్యాప్ వచ్చింది. ఈ మధ్యన స్థానిక ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికలు జరిగాయి. అయినా సరే రెండు పార్టీలు కనిపించిన సీన్ లేదు. ఒక దశలో ఈ పొత్తు చిత్తు అవుతుందా అన్నంతగా కధ నడచింది.అయితే దానికి బిగ్ ట్విస్ట్ ఇస్త్తూ నవంబర్ 11న విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీతో పవన్ భేటీ అయ్యారు. ఇక అక్కడితో కధ సుఖాంతం అని అనుకున్నా మరో నెలన్నర కాలం ఇట్టే గడచిపోయింది. ఈ మధ్యన వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వను అంటూ పవన్ గంభీరమైన ప్రకటనలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే టీడీపీతో పొత్తు అర్ధమని కూడా విశ్లేషించే వారూ ఉన్నారు.
ఇపుడు సడెన్ గా బీజేపీ జనసేనల ఉమ్మడి సమావేశానికి డేట్ టైం ఫిక్స్ చేశారు. డిసెంబర్ 25న ఆ మీటింగ్ జరగనుంది. ఆ రోజున అటల్ బిహారీ వాజ్ పేయ్ పుట్టిన రోజు. ఆయన బీజేపీలో వరిష్ట నాయకుడు. పార్టీలకు రాజకీయాలకు అతీతమైన వ్యక్తిత్వం ఆయన సొంతం. వాజ్ పేయ్ జయంత్రి వేళ రెండు పార్టీలు కూర్చొని మాట్లాడుకుని ఏపీ రాజకీయాల మీద ఒక రోడ్ మ్యాప్ ని ప్రకటిస్తారని అనుకుంటున్నారు.
ఇక చూస్తే పవన్ కళ్యాణ్ కి బలం చాలానే పెరిగింది అని బీజేపీ నమ్ముతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో జనసేనకు మంచి రెస్పాన్స్ ఉంది అని భావిస్తోంది. దాంతో కొన్ని అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ సీట్లను కూడా కైవశం చేసుకోవచ్చు అని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. ఇక పవన్ సైతం గోదావరి జిల్లాలలో పోటీ చేస్తారని దాంతో ఆ ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుందని కూడా కమలనాధులు విశ్వసిస్తున్నారు.ఇవన్నీ పక్కన పెడితే ఈ నెల 25న మీటింగ్ కి పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతారా నాదెండ్ల మనోహర్ ని పంపుతారా అన్నది కూడా చర్చగా ఉంది. పవన్ వస్తే ఆ మజావే వేరుగా ఉంటుంది. ఏది ఏమైనా పవన్ తో జత కట్టి వచ్చే ఎన్నికలలో తమ రాజకీయ అదృష్టాన్ని మార్చుకోవాలని బీజేపీ చాలా ఆశగా ఉంది. మరి జనసేన బీజేపీ మీటింగ్ ఏ రకమైన రాజకీయ సంచలనలకు తెర లేపుతుందో చూడాల్సి ఉంది.