జనసముద్రం న్యూస్,డిసెంబర్ 23:
ఆయన అల్లాటప్పా అధికారి కాదు. ఏపీ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి. పాలనా వ్యవస్థల్ని నేరుగా పర్యవేక్షించే ఆయన.. హైకోర్టుకు వెళ్లిన వేళ.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై హైకోర్టు సంధించిన ప్రశ్నల వర్షంలో తడిచి ముద్ద కావటంతో పాటు.. సమాధానాలు చెప్పలేక పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదట. తాజాగా ఏపీ సీఎస్ కు ఎదురైన ఇబ్బందికర పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం.. ప్రభుత్వాధినేత జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని చెబుతున్నారు.
కోర్టు ఆదేశాలకు భిన్నంగా స్కూళ్ల ప్రాంగణాల్లో గ్రామ.. వార్డు సచివాలయాలు.. రైతు భరోసాకేంద్రాలు.. ఆరోగ్య కేంద్రాల్ని నిర్మించటంపై వివరణ ఇచ్చేందుకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి హైకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లోపాలపై హైకోర్టు కడిగి పారేసినంత పని చేయటంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారంటున్నారు.అంతేకాదు.. ఉద్యోగులు.. కాంట్రాక్టర్లు.. న్యాయాధికారులు.. సిబ్బందికి చెల్లించాల్సిన బకాయిల విషయంలో జరుగుతున్న ఆలస్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు పలు ఆదేశాల్ని జారీ చేసింది. ఈ కేసు విచారణను జనవరి 20కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. పలు కోర్టు ధిక్కార ఆదేశాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలకు భిన్నంగా నిర్మించిన నిర్మాణాలు అక్రమమని.. వాటికి చెల్లింపులు జరపటం అక్రమేమని పేర్కొంది.
స్కూళ్లలో విద్యా వాతావరణాన్ని కాపాడేందుకు కోర్టు సరైన ఉత్తర్వులు ఇస్తే.. 63 చోట్ల పాఠశాలల్లో సచివాలయాలు.. ఆర్బీకేలు నిర్మించారని.. 57 చోట్ల ఆ భవనాల్ని స్కూళ్లకు అప్పగించగా.. తరగతి గదులుగా.. ఇతర అవసరాలకు వాడుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. కోర్టు ఆదేశాల అమలులోఆలస్యమైందన్న సీఎస్.. అందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆయన్ను పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. హైకోర్టు అడిగిన ప్రశ్నల్లో శాంపిల్ గా కొన్నింటిని చూస్తే..
– కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు చేయాల్సిన నిధులతో సచివాలయాలు.. ఆర్బీకేలు ఎలా నిర్మిస్తారు?
– ఉపాధి హామీ నిధుల్లో ఒక్క రూపాయి కూడా మళ్లించే వీల్లేదు కదా?
– పంచాయితీ భవనాలు.. సచివాలయ భవనాలు వేర్వేరని.. వాటిని కలిపి చూడొద్దని గతంలో ప్రభుత్వమే చెప్పింది. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించటం ఏమిటి?
– ఉపాధి నిధుల్ని దుర్వినియోగం చేసినందుకు ఆ మొత్తాల్ని తిరిగి చెల్లించాల్సిందిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పత్రికల్లో చూశాం.
– పాఠశాల ప్రాంగణాల్లో నిర్మాణాలు చేపట్టే ముందు.. స్కూల్ డెవలప్ మెంట్ కమిటీ.. పేరెంట్స్ కమిటీలతో చర్చించారా?
– పాఠశాలల్లో నిర్మాణాలతో విద్యార్థులకు అసౌకర్యమని.. వాటిని నిలిపివేయాలని గతంలో ఉత్తర్వులు ఇచ్చాం కదా? వాటిని ఎలా నిర్మిస్తారు? అవి అక్రమ నిర్మాణాలు అవుతాయి కదా?
– ఇప్పటికి 239 చోట్ల నిర్మాణాలు వివిధ దశల్లోఉన్నాయి. వాటి సంగతేంటి? వాటికి చెల్లించిన రూ.40కోట్ల లెక్కే మాటేంటి?
– ఇందుకు బాధ్యులైన సీఎస్ నుంచి కింది స్థాయి వరకు ఉన్న అధికారుల జేబుల నుంచి ఈ మొత్తాన్ని రాబట్టాలని అనుకుంటున్నాం.
జీతాల కోసం ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కటం ఏపీ చరిత్రలో ఎప్పుడైనా చూశారా?
– జీతాల కోసం బెగ్గింగ్ నేనెప్పుడూ చూడలేదు. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వరు కానీ.. అక్రమ నిర్మాణాలకు రూ.40 కోట్ల బిల్లుల చెల్లింపులు చేస్తారు?